సంక్రాంతికి ఊరెళ్తున్నారా... అయితే జాగ్రత్త

11:42 - January 13, 2018

హైదరాబాద్ : సంక్రాంతి అంటే ప్రజలకు కేవలం పండగ... అదే దోపిడీ దొంగలకైతే పండగే పండగ. ఎందుకంటే... తాళాలు వేసిన ఇళ్ళను దోచుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోకి   కొన్ని ముఠాలు ఎంటర్‌ అయ్యాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సో... అంతర్రాష్ర్ట దోపిడీ దొంగలపై  టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ... .
తాళాలు వేసిన ఇళ్ళే దొంగల టార్గెట్
పండగను ఎంజాయ్‌ చేసేందుకు ఊరెళ్తున్నారా... జాగ్రత్త... ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోకి  కొన్ని అంతర్రాష్ర్ట దోపిడీ ముఠాలు ఎంటర్‌ అయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్ళే టార్గెట్‌గా వారు తెగబడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇళ్ళు, అపార్ట్ మెంట్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుంటాయని పోలీసులు అంటున్నారు.
దోపిడి ముఠాలపై అనుమానం
యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ముంబై, ఒరిస్సా తదితర రాష్ర్టాలకు చెందిన దోపిడి ముఠాలు...  దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  అందుకే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఆదిభట్ల, మీర్‌పేట, ఎల్బీనగర్, ముషిరాబాద్, అబిడ్స్, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పీఎస్‌ పరిధుల్లో అపార్ట్‌ మెంట్లలో చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు. నగరంలోని హుమయున్‌ నగర్ పీఎస్‌ పరిధిలో అటెన్షన్‌ డైవర్షన్‌ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకోసమే పోలీసులు ముందు జాగ్రత్తగా.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
సంక్రాతికి సగం సిటీ ఖాళీ
సిటీలో అసలే చైన్‌ స్నాచింగ్ బ్యాచ్‌లు కలకలం రేపుతుంటే.. మరోవైపు దోపిడీ ముఠాలు  రెచ్చిపోతున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా అందికాడికి విలువైన సొత్తును దోచుకెళ్తున్నారు. సంక్రాంతి సెలవులతో దాదాపు సగం సిటీ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే అదనుగా భావించే దొంగలు  దోపిడీలకు తెగబడే ప్రమాదం ఉందంటున్నారు పోలీసులు. దొంగల భారిన పడకుండా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  సూచిస్తున్నారు. 
100, వాట్సాప్, ఎస్ఎంఎస్, హ్యాక్ఐకి తెలపండి : పోలీసులు
చోరీల గురించి సమాచారం ఇవ్వడానికి 100 కు కాల్‌ చెయ్యడం లేదా.. వాట్సాప్, ఎస్ఎంఎస్, హ్యాక్ఐ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా మంచిదని పలువురు సీనియర్ సిటిజన్స్‌తోపాటు న్యాయవాదులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల క్రైమ్‌ రేటును తగ్గే అవకాశం ఉంటుందని వారంటున్నారు. పండగ సంబరంలో జాగ్రత్తలు మరిచిపోతే... ఇళ్ళుగుళ్ళవుతాయి... కాబట్టి ఊర్లకు వెళ్ళే వారంతా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Don't Miss