కళ కోల్పోతున్న చేనేత కార్మికులు

12:04 - July 8, 2015

అతివల అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయ మహిళలు.. అందులో తెలుగువాళ్లకు చీర అంటే మహా ఇష్టం. చీరల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది. అయితే నేతన్నల నైపుణ్యం వారి కడుపులు మాత్రం నింపలేకపోతుంది. చాలీచాలని సంపాదనతో ఎలా బతకాలో అర్ధం కాక నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఉప్పాడ చీరలు నేసే చేనేత కార్మికుల వెతలపై 10టీవీ ప్రత్యేక కథనం.
ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి మూడొందల ఏళ్ల చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి గ్రామం. చేనేత వస్త్రాల తయారీలో మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జామ్దానీ చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని మరో చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దానీ చీరలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే. చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.
చీర తయారీకి 10 రోజుల నుంచి రెండు నెలలు .....
ఇంత ప్రాచుర్యం ఉన్న ఉప్పాడ చీరల వెనుక చేనేత కార్మికుల కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. జామ్దానీ చీర తయారీకి 10 రోజుల నుండి రెండు నెలల వరకు పడుతుంది. ఈ చీరల తయారీలో స్వచ్చమైన జరీతో పాటు.. బెంగళూరుకు చెందిన సన్నటి పట్టును వినియోగిస్తారు. అన్ని పట్టువస్త్రాల మాదిరిగా కాకుండా ఈ చీరపై ఉన్న డిజైన్‌.. ఇరువైపులా ఉండడం దీని విశిష్టత. అంతేగాక కంచి, ధర్మవరం పట్టుచీరల కంటే బరువు తక్కువగా ఉండటం మరో విశేషం.
చీర తయారీకి శ్రమించనున్న ముగ్గురు కార్మికులు ........
ఈ చీర తయారీకి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు రోజుకు 10 గంటలు నిర్విరామంగా శ్రమిస్తారు. ఈ చీరను నేసేందుకు డిజైన్‌ వేసుకోవడం.. సిల్క్‌ దారాలు అల్లడం.. మగ్గంపై నేయడం వరకు కార్మికులు ఎంతో శ్రమిస్తారు. అయితే ఇంతటి అందమైన చీరలను తయారు చేసే నేతన్నల బతుకులు మాత్రం దుర్భరంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ, విదేశాల్లో జామ్దానీ చీరలకు గిరాకి.....
దేశ, విదేశాల్లో జామ్దానీ చీరలకు గిరాకి పెరుగుతున్నా చీరను తయారుచేసే నేతన్నలకు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎంతోమంది ప్రముఖులు వీరి నైపుణ్యాన్ని మెచ్చుకొని ఈ చీరలను కొని ప్రాచుర్యం పెంచినప్పటికీ.. చీరలను తయారుచేసే నేతన్నలను గుర్తించడం లేదు. ఇక వ్యాపారులు నేతన్నల అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. చాలీచాలని కూలీలు ఇస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన నేతలు మాత్రం వాటిని అమలుచేసిన దాఖలాలు లేవు. దీంతో చేనేత కార్మికులు ఎలాంటి ఆదరణ లేక ఇదే వృత్తిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్ధికంగా స్థోమత లేకపోవడంతో చేనేత కార్మికులు తమ పిల్లలను సైతం చదవించుకోలేకపోతున్నారు. వీళ్లు సైతం చేసేందుకు వేరే పని లేక ఉన్న కులవృత్తినే నమ్ముకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
తయారీలో నైపుణ్యం ఉన్నప్పటికీ....
ఎన్నో తరాలుగా ఈ చీరల తయారీలో నైపుణ్యం ఉన్నప్పటికీ.. కార్మికులు బతకడం కష్టంగా మారింది. నమ్ముకున్న వృత్తి కడుపు నింపలేక.. ఆదుకుంటామని ఊదరగొట్టిన పాలకులు పట్టించుకోకపోవడంతో చేనేత కార్మికులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు. 

Don't Miss