11 ఏళ్ల తరువాత రానున్న తీర్పు...

11:05 - April 16, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో తుది తీర్పు కాసేపట్లో వెలువడనుంది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను కోర్టుకు తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగాయి. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్సపొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా 11 మందిపై ఎన్‌ఐయే కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో నిందితుడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొత్తం 226 మంది సాక్షులను విచారించింది. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

Don't Miss