ఆరోగ్య ఆలవాట్లు..

07:33 - April 5, 2016

మారిన జీవన విధానం.. మనిషికి అనేక రోగాలను తెచ్చిపెడుతోంది. అలాగని లైఫ్‌స్టైల్‌ మార్చుకుందామంటే ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, నైట్‌షిప్ట్ లాంటివెన్నో చేతిలో లేని పనులు. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోలేకపోయినా కొన్ని అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అదేపనిగా కూర్చోవద్దు...
పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఉంటారు కొందరు. దానివల్ల ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. అరగంటకోసారి లేచి రెండు మూడు నిముషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. దానివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివి రాకుండా ఉంటాయి.
అల్పాహారం తప్పనిసరి...
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. ఏం కాదులే... ఆకలి, నీరసంతో అలాగే పనిచేసేద్దాం అనుకున్నారంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. టిఫిన్‌ చేయడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను అయినా తినాలి. ఇవి తినడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది.
భుక్తాయాసం అనర్థం...
చల్లటి నీళ్లు తీసుకొనే బదులు పని చేసే సమయంలో కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శారీరక నొప్పులు దూరం అయి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. అయితే వంట బాగుందనో, కూర రుచిగా ఉందనో భుక్తాయాసంగా తినకుండా కాస్త పొట్ట వెలితిగా ఉంచుకోవడం ఉత్తమం.
లంచ్‌టైమ్‌లో వేపుళ్లు వద్దు...
మధ్యాహ్న లంచ్‌ టైమ్‌లో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. వాటివల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పని చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. సులభంగా జీర్ణమవుతాయి కూడా.
కంప్యూటర్‌ ముందు పనిచేస్తే...
కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం. కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్‌ లోషన్‌ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు రావు.
లేట్‌నైట్స్ వద్దు...
రాత్రి ఎనిమిది గంటలలోపే డిన్నర్‌ చేయడం ఉత్తమం. లేట్‌గా తింటే తొందరగా నిద్రపట్టదు. రాత్రి సమయంలో ఎక్కువ నీళ్లు తాగకూడదు. అంతేకాదు రాత్రి సమయంలో ఎక్కువగా టీవీ చూస్తే కళ్లు ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి టీవీకి దూరంగా ఉండండి.
ఉదయం నడక, నీళ్లు తప్పనిసరి...
ఉదయాన్నే నిద్ర లేవగానే నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల అనేక జబ్బులు దూరమవుతాయి. రోజూ కచ్చితంగా అరగంటపాటు నడక ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటాయి. ఉప్పు అధికంగా తినటం ప్రమాదం. జంక్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. అన్నింటికీ మించి వారానికోసారయినా ఖాళీ సమయాల్లో బంధువులు, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ఆయుష్షు పెరుగుతుంది.

Don't Miss