నవ్వుతో జ్ఞాపకశక్తి..

07:05 - April 29, 2016

నవ్వు బాధను మరిపిస్తుంది. విచారాన్ని పోగొడుతుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. వీటన్నింటితో పాటు మంచి ఔషధంగానూ పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి దాని మూలంగా తలెత్తే దుష్ప్రభావాల నుంచి కూడా కాపాడుతుంది. అధ్యయనం ఒకటి ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది కూడా. ఒత్తిడి హార్మోన్‌ అయిన 'కార్టిజోల్‌' వల్ల మెదడు దెబ్బతినటాన్ని నవ్వు తగ్గిస్తున్నట్టు... ఫలితంగా వయసుతో పాటు వచ్చే మతిమరుపు తగ్గటానికి దోహదం చేస్తున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం.
మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెదడులోని నాడీకణాలను దెబ్బతీసే అవకాశముంది. ఒత్తిడి మూలంగా వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం తగ్గుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. నవ్వు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి కార్టిజోల్‌ ప్రభావంతో మెదడు దెబ్బతినటాన్ని నవ్వు తగ్గిస్తుందా? లేదా? అనేది తెలుసుకోవడానికి లోమా లిండా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.
కొందరు వృద్ధులకు 20 నిమిషాల సేపు హాస్యభరిత వీడియోలను చూపించి జ్ఞాపకశక్తిని పరీక్షించగా... వీరిలో కార్టిజోల్‌ మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటం, నేర్చుకునే సామర్ధ్యం, ప్రదేశాలను గుర్తించడటం వంటివి మెరుగుపడ్డాయి. మధుమేహ వృద్ధుల్లో ఈ ఫలితాలు మరింత ఎక్కువగా కనబడటం విశేషం. కార్టిజోల్‌ వంటి హార్మోన్ల దుష్ప్రభావాలను తగ్గించటంతోపాటు రక్తపోటు తగ్గటానికి, రక్తసరఫరా మెరుగుపడటానికి, ఉత్సాహాన్ని పెంపొందించటానికి నవ్వు తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
నవ్వటం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును తెచ్చిపెట్టటమే కాదు. గామా తరంగ ఫ్రీక్వెన్సినీ మెరుగుపరుస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి కూడా పుంజుకుంటుంది. సొంతంగా తమ పనులను తాము చేసుకోవటానికి, హాయిగా జీవించటానికి వృద్ధులకు జ్ఞాపకశక్తి చాలా కీలకం. కాబట్టి వీరికి ఇతర చికిత్సలతో పాటు నవ్వు చికిత్సలనూ జోడించటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. 

Don't Miss