కన్నుమూసిన ఆదివాసి ఉద్యమ నేత బిడి శర్మ

12:02 - December 8, 2015

హైదరాబాద్ : ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపేందుకు దశాబ్దాలుగా కృషి చేశారు. కలెక్టర్‌గా ఆదివాసీలకు అండగా నిలిచారు. ఉన్న ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా భావించి అడవి బిడ్డల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. గిరిజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆ మహా మనిషి బ్రహ్మదేవ్‌ శర్మ ఇక లేరు.

ఆదివాసీల కోసం అహర్నిశలు కృషి చేసి....

ఆదివాసీల కోసం అహర్నిశలు కృషి చేసి, భారత ప్రజా ఉద్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న మహా వ్యక్తి డాక్టర్‌ బ్రహ్మదేవ్‌ శర్మ ఆదివారం గ్వాలియర్‌లో కన్ను మూశారు. ఆయన గత కొన్నాళ్లుగా అస్వస్థతగా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌లో జన్మించారు..

బిడి శర్మ 19 జూన్‌, 1931లో ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌లో జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు మారింది. బిడి శర్మ1956లో మధ్యప్రదేశ్‌ కాడర్‌ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. గణితంలో పిహెచ్‌డి చేసిన శర్మ- 1968 నుంచి 1970 వరకు మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆదీవాసీ సమాజంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడింది.

1973-74లో హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా....

ఎప్పుడూ గిరిజనులు, పేదలు, రైతుల సంక్షేమం గురించే ఆలోచించే శర్మ- ఎస్‌టి కమిషన్‌ కమిషనర్‌గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఆదివాసీలకు ఎంతో న్యాయం చేకూరిందని చెబుతారు. 1973-74లో హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా బిడి శర్మ పనిచేశారు. గ్రామాల్లో పేదరికం కారణంగానే రైతులు దోపిడీకి గురవుతున్నారని తెలిపేవారు.

బిడి శర్మ ఆవేదన.....

భూమి, నీరు, అడవిని నమ్మకుని జీవించే ఆదీవాసీలకు అభివృద్ధి పేరిట ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతిస్తుండడం వల్ల వారు తమ ఉనికిని కోల్పోతున్నారని బిడి శర్మ ఆవేదన చెందేవారు. 1980లో బస్తర్‌లో పాయిన్‌ ప్రాజెక్ట్‌ నిర్మించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బిడి శర్మ తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారంటే ఆదీవాసీల పట్ల అయనకున్న అంకిత భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఆయన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే కొందరు అభం శుభం తెలియని ఆదివాసి అమ్మాయిలను పెళ్లి పేరిట వారిపై అత్యాచారానికి పాల్పడేవారు. అలాంటివారిని గుర్తించిన శర్మ - దాదాపు 3 వందల ట్రైబల్‌ అమ్మాయిలను గిరిజనేతర వాళ్లతో పెళ్లి చేసి న్యాయం చేశారు.

ఆదీవాసీలు మావోయిస్టులకు మద్దతిస్తున్నట్టు...

తమ హక్కులను కాపాడుతున్నందువల్లే ఆదీవాసీలు మావోయిస్టులకు మద్దతిస్తున్నట్టు తనకు అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో శర్మ పేర్కొన్నారు. బస్తర్‌ కలెక్టర్‌గా తాను పెద్ద ప్రాజెక్టులకు అనుమతించలేదని ఆయన చెప్పారు. ఓసారి బస్తర్‌ కలెక్టర్‌ అలెక్స్‌పాల్‌ మీనన్‌ను మావోయిస్టులు కిడ్నాప్‌ చేస్తే ప్రభుత్వం తరపున శర్మ మధ్యవర్తిగా వ్యవహరించి ఆయనను విడిపించారు.

శర్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది.....

ఆదీవాసీ ప్రాంతాల్లో అడవి, భూమి, నీరు లాంటి వనరులపై ఇప్పటికీ వారికి యాజమాన్య హక్కులు కల్పించకపోవడం అన్యాయమని చెప్పేవారు. బ్రిటీష్‌ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించారని- కానీ.. దేశానికి స్వాతంత్రం వచ్చాకా ఆదివాసీల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని శర్మ ఆవేదన చెందేవారు. ఆదీవాసీ సమాజ పరిరక్షణ కోసం వారి వికాసానికి కృషి చేసిన శర్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది.

Don't Miss