సుద్దాల హన్మంతు పాటల తూటా...

07:43 - October 10, 2015

కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసుకుని...తన గొంతును పాటల తూటాగా మలిచి ప్రజల్ని ఉద్యమ బాట పట్టించిన గొప్పవ్యక్తి సుద్దాల హన్మంతు. తన ఆలోచనలకు పదునుపెట్టి, వాటికి సామాజిక స్పృహను జోడించి, దానికి తన గొంతుకలోని ఆవేశాన్ని కలిపి సాయుధ రైతాంగ పోరాటాన్ని పల్లెపల్లెకూ విస్తరింపజేసిన మహనీయుడు హన్మంతన్న. తెలంగాణలో సాంస్కృతికోద్యమానికి ఊపిరిలూదిన మహనీయుడు. 'పల్లెటూరి పిల్లగాడ...పశులగాసే మొనగాడ...పాలు మరిసి ఎన్నాళ్లయిందో..' అంటూ తన పాట ద్వారా ప్రజల హృదయాలను నిమిరిన మహోన్నత వ్యక్తి. నేటికీ ఆ పాట సజీవంగానే ఉంది.

నల్గొండ జిల్లాలో జననం..
సుద్దాల హన్మంతు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో 1908 డిసెంబర్‌లో జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం గుండాల మండలం సుద్దాలకు వెళ్లింది. ఆ ఊరు పేరే హన్మంతు ఇంటిపేరుగా చరిత్రలో నిలిచిపోయింది. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఆయనను స్మరించుకోవడమంటే సాంస్కృతికద్యోమాన్ని మరోమారు గుర్తు చేసుకోవడమే. హన్మంతన్న పాట నిజాం నిరంకుశ పాలనపైనా, దోపిడీ గుండెలపైనా తూటా అయింది. ఆయన అక్షరం ఆయుధమైంది. పీడిత, తాడిత అణిచివేయబడ్డ ప్రజలకు అండై నిజాం అల్లరి మూకల రజాకార్లను తరిమితరిమి కొట్టడంలో ఆయన పాటలు, ఆటలు, మాటలు ఎంతో దోహదపడ్డాయి. హన్మంతన్న పాటలు ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించినవి. పోరుబాట పట్టించినవి. పోరాట స్ఫూర్తి రగిలించినవి. యాదగిరి రాసిన 'బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె పోతావు కొడుకో నైజాం సర్కారోడ' అనే పాట అనే ఉద్యమాలకు ఉర్రూతలూగించింది. నాటి నిజాం అల్లరిమూకలు రజాకార్లు, జమీందార్లు, ముక్తేదార్లు, విసునూరు దొర భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం మహౌజ్వలం అయినది. బాంచన్‌ దొరా కాలుమొక్కుతా అన్నవారితో బందూకులను పట్టించినటువంటి మహా విప్లవమది. విసునూరు గడీలలో యేండ్లకేండ్లు వెట్టి చాకిరిలో మగ్గిపోతున్నటువంటి అభాగ్యులకు విముక్తి కల్పించినటువంటి పోరాటం.

ప్రజల కోసం జీవితం ధారాదత్తం..
కష్ట జీవుల కోసం కడ వరకు తన జీవితాన్ని అంకితమిచ్చినటువంటి సుద్దాల హనుమంతు తన జీవితాన్ని ప్రజల కోసం ధారబోశాడు. వేలాది మంది కవులు, కళాకారులు, రచయితలు ఆ నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యానిస్టు విప్లవాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పాటలు, రచనలు ఆ నాడు తెలంగాణ ప్రజల్లో ఉత్తేజపరచాయి. ఆంధ్ర మహాసభలో చేరి కమ్యూనిస్టు పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశాడు. వరినాట్లు వేసేటప్పుడు వరి మోతలు మోసేటప్పుడు నాగలితో పొలాన్ని దున్ని అలసిపోయి..సొలసిపోయి ఒడ్డుమీదికి వచ్చి శ్రమ నుంచి విముక్తి పొందడానికి హన్మంతు పాటలు ఉయ్యాలలవుతాయి. ఒక పాట ఎంతో మందిలో చైతన్యాన్ని రగిలిస్తుంది. ఉద్యమాల వైపు నడిపిస్తుంది. పాటలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. పాటకు ఉన్న విలువే వేరు. హనుమంతు అద్భుతమైన పాటలను అల్లినాడు. ప్రజలను విశేషంగా ఆకర్షించే యక్షగానాన్ని వీర తెలంగాణ పేరుతో కొత్తగారాసి వేలాది గ్రామాలలో కళా ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఏయే దొర కబంధహస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి దొరల ఆగడాలను పల్లెసుద్దుల రూపంలో చెబుతూ ప్రజల్ని చైతన్యపరిచాడు. పల్లెపల్లె తిరుగుతూ గ్రామ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. రాజపేట మండలం రేణుకుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్నారు. అక్కడ సుద్దాల హనుమంతుతో పాటు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరిలు ఉన్నారు. గ్రామసభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సభలో ఉన్న వారు చెట్టుకొక్కరు...పుట్టకొక్కరు పారిపోతున్న క్రమంలో ఓ ముసలామె చేతిలో ఉన్న కర్రను హన్మంతు అందుకుని భూమిపై కర్రను కొడుతూ 'వెరు.. దెబ్బ దెబ్బకు దెబ్బ...' అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు. పాటకు నిలయమైన పోరాటానికి స్నేహమై తెలంగాణ సాహితీ లోకంలో తెలంగాణ సాయుధ పోరాటంలో చెరగని ముద్ర వేశారు. క్యాన్సర్‌తో చనిపోయే వరకూ పేదల కష్ట సుఖాల గురించే ఆలోచించారు.

Don't Miss