'టీ హబ్' గ్రాండ్ లాంఛ్‌..

21:34 - November 5, 2015

కలల సాకారానికి ఆహ్వానం. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం. ప్రపంచ గతిని మార్చే ఆవిష్కరణల నిలయం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్‌ వైభవంగా లాంఛ్ అయ్యింది. దేశవిదేశాల పారిశ్రామికవేత్తల సమక్షంలో ప్రారంభమైంది. స్టార్టప్ లతో యువత ఆలోచలనకు ఊతమివ్వబోతోంది. యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ హబ్. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక ఇది. ఎన్నో రోజులుగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించి, యువతలో సరికొత్త ఉత్సాహం నింపిన టీ హబ్‌ గచ్చిబౌలిలో గ్రాండ్ గా లాంఛ్‌ అయ్యింది.
రతన్ టాటా చేతులమీదుగా..
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంతో మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, యువ ఎంట్రప్రెన్యూర్లు, విద్యార్థుల సమక్షంలో టీ హబ్ ను లాంఛ్‌ చేశారు టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా. ఉత్తమ ఆలోచనలకు టీ హబ్ సరియైన వేదిక అని రతన్ టాటా అన్నారు. నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారమని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు.
స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ : కేటీఆర్
స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చి దిద్దుతామని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భారత్‌లో మేధోసంపత్తికి కొదవ లేదన్న కేటీఆర్ తయువభారత్ ప్రపంచానికి సవాలు విసురుతుందన్నారు. గూగుల్,ఫేస్‌బుక్ తర్వాత సంచలనం భారత్‌లోనేనని, అదీ హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. టీ హబ్ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తుందన్నారు గవర్నర్ నరసింహన్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉత్తమ ఆలోచనపరులున్నారని, టీ హబ్ సేవలు గ్రామీణ ప్రాంతం ఆలోచనపరులకు చేరేలా చూడాలని సూచించారు. నూతన ఆలోచనలకు టీ హబ్ ట్రెండ్‌సెట్టర్ అవుతుందని ఆకాంక్షించారు.
ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి.. 
ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ హబ్ నినాదం. ఐటీలో దేశానికే తలమానికమైన భాగ్యనగరం స్టార్టప్ ల రాజధానిగా మరో ప్రస్థానం దిశగా దూసుకుపోతోంది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రస్థానం మరో మేలి మలుపు దిశగా అడుగు వేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్తేజమైన స్టార్టప్‌ లకు ఇండియాలో ప్రధాన కేంద్రం కానుంది. స్టార్టప్. అంటే కొత్త కంపెనీలు. యువకుల మదిలోని పారిశ్రామిక ఆలోచనలకు కార్యరూపం. అందుకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని కోసమే గచ్చిబౌలిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ హబ్‌ ను ప్రారంభించింది.
హైదరాబాద్ లో ఇప్పటికే ఇంక్యుబేషన్ వ్యవస్థ అభివృద్ది
ఐటీతో పాటు అనేక రంగాల్లో పురోగమిస్తున్న హైదరాబాద్ లో ఇప్పటికే ఇంక్యుబేషన్ వ్యవస్థ అభివృద్ది చెందింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటీ, బిట్స్ పిలానీ, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్, హైదరాబాద్ చాప్టర్, ద ఇండర్ ఎంటర్ ప్రైజెస్ వంటి సంస్థలు భాగ్యనగరంలో స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నాయి. స్టూడెంట్స్, ఔత్సాహికుల ఆకాంక్షలు, ఆలోచనలకు కార్యరూపం దాల్చేందుకు చేయూతనిస్తున్నాయి.
ఇంక్యుబేటర్లకే ఇంక్యుబేటర్‌గా టీ హబ్
దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌గా, ఇంక్యుబేటర్లకే ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ను తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం. స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్ అవతరించబోతోంది. రూ.100 కోట్ల ఫండింగ్‌తో తొలి విడత స్టార్టప్‌లను ప్రారంభించి భవిష్యత్తులో దీన్ని రూ.600 కోట్లకు పెంచుతామని సర్కారు చెబుతోంది. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ ఇప్పటికే అమెరికాలోని సిలికాన్ వ్యాలీని సందర్శించారు. అక్కడి పెట్టుబడిదారులతో మాట్లాడి టీ హబ్ గురించి వివరించారు.
ఇప్పటికే 20 కంపెనీలతో ఒప్పందాలు
టెక్నాలజీ హబ్‌లో సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 20 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, హూస్టన్, ఎంఐటీ మీడియా ల్యాబ్, ఇంక్యుబియో ఆఫ్ స్పెయిన్ వంటి దిగ్గజ విద్యాసంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన పరిశోధనశాలలు, విద్యాసంస్థలతోనూ ఎంవోయూల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. బెంగళూరుకు ధీటుగా కొత్త కంపెనీల ఏర్పాటు, అభివృద్దికి అన్ని విధాలా చేయూతనివ్వాలని టీ సర్కారు ప్రయత్నిస్తోంది.
మీ కలలకు కొత్త చూపు... వెలుగు దారి..
FOLLOW YOUR DREAMS అంటూ మీ కలలకు కొత్త చూపునిస్తుంది. LOOK AT THE BRIGHT SIDE అంటూ వెలుగుదారి చూపిస్తుంది. మది తలపును తట్టే ఏవేవో ఆలోచనలకు తుదిరూపునిస్తుంది. రంగు రంగుల గోడల మీద నినాదాలతో స్ఫూర్తినిస్తుంది. ఆలోచనకు పదును పెట్టే మార్గదర్శనం చేస్తుంది. సమావేశ మందిరాలు, పని ప్రదేశాలు, కెఫెటేరియా, లాంజ్ ఇలా ఎక్కడ చూసినా...టీ హబ్‌ బిల్డింగ్‌ నవ్యనూతనంగా, యువతను ఆకట్టుకునేలా తీర్చిద్దిద్దారు. ఎంత గొప్ప ఆవిష్కరణకైనా ఆలోచనే మూలం. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఛాన్స్ ఇస్తే ఎన్నెన్నో అద్భుతాల ఆవిష్కారం. వినూత్న ఆలోచనకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది టీ హబ్ బిల్డింగ్.
70వేల చదరపు అడుగుల విస్తీర్ణం..
వేలవేల ఆలోచనల సంఘర్షణక నిలయం టీ హబ్. దీంట్లో అడుగుపెడితే అదో సృజనా ప్రపంచంలా కనిపిస్తుంది. యువతలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. సృజనాత్మకతకు పదునుపెట్టే వేదిక టీ హబ్. ఔత్సాహిక యువతకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ సర్కారు. ఒక్కరిద్దరు కాదు వేలమంది ఒకచోట చేరి వందలాది నూతన ఆవిష్కరణలకు పురుడుపోసే సదావకాశం టీ హబ్ రూపంలో అందివస్తోంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్, డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తుల అభవృద్దికి కృషి చేస్తున్న స్టూడెంట్స్, ఔత్సాహికులకు టీ హబ్ వేదిక అవుతుంది. టీ హబ్ లో కార్యకలాపాలు చేపట్టడానికి దాదాపు 500 స్టార్టప్ లు అప్లై చేసుకున్నాయి. అయితే వీటిలో 140 కంపెనీలను ప్రస్తుతానికి ఎంపిక చేశారు. ఇవి వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.
రాయదుర్గంలో మరో భవనం
రెండోదశలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయదుర్గంలో మరో భవనాన్ని నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 3 సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్న ఈ బిల్డింగ్ కోసం ప్రభుత్వం రూ. 150 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ప్రతిపాదనలో ఉంది. 2018లో హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరిగే నాటికి టీ హబ్ సెకండ్ ఫేజ్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ను స్టార్టప్ లకు కేంద్రంగా మార్చడానికి టీ హబ్ వరమంటున్నారు పారిశ్రామికవేత్తలు. హైదరాబాద్ లో వ్యయం తక్కువ. దీంతో వెంచర్, ఏంజెల్ ఫండ్ లు ఇచ్చే నిధులు ఇతర సిటీల్లో కేవలం ఒక ఏడాదికే సరిపోతాయి. అయితే హైదరాబాద్ లో రెండు, మూడేళ్లకు సరిపోతాయి. అంతేకాదు రవాణా పరంగా కూడా హైదరాబాద్ కీలక ప్రాంతంలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే స్టార్టప్ ల గోల్డెగ్ ట్రయాంగిల్ గా అభివృద్ది చెందుతుంది. ఇలా ఎన్నో సానుకూలతలు హైదరాబాద్‌ కు ఉన్నాయి.
టీ హబ్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర
కొత్త ఆలోచనలకు చేయూతనివ్వాలనుకున్నారు. సాఫ్ట్ వేర్ లో దూసుకెళుతున్న భాగ్యనగరాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకున్నారు. స్టార్టప్ ల రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నారు. యువ పారిశ్రామికవేత్తల భుజం తట్టాలనుకున్నారు. ప్రపంచం మెచ్చేలా, దేశం ముచ్చటపడేలా గ్రాండ్ గా లాంఛ్‌ చేయాలనుకున్నారు. లక్ష్యం దిశగా తొలి అడుగువేశారు. ఆయన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. టీ హబ్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర. తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మానస పుత్రిక టీ హబ్. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ పర్యవేక్షణలో ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ ను స్టాపించడంలో ఆయనదే కీలక పాత్ర.
నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ డిగ్రీ
నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ డిగ్రీ చేశారు కేటీఆర్. తర్వాత పూణే యూనివర్సిటిలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్ నుంచి మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ పట్టా పొందారు. తర్వాత పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. అయితే రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక..కీలకమైన పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్. గతంలో ఏమాత్రం మంత్రిగా అనుభవం లేకపోయినా చాలా ప్రతిభావంతంగా రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ మరింత అభివృద్దికి అహర్నిశలు పని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీ హబ్ ను ప్రారంభానికి కృషి చేశారు.
హైదరాబాద్... స్టార్టప్ ల రాజధాని...కేటీఆర్ ఆశయం.
హైదరాబాద్ ను స్టార్టప్ ల రాజధానిగా తీర్చిదిద్దడం కేటీఆర్ ఆశయం. అందుకోసం ఆయన సిలికాన్ వ్యాలీలోనూ పర్యటించారు. ఐటీ కంపెనీల అధినేతలను కలిశారు. స్టార్టప్ కేంద్రంగా హైదరాబాద్ నిలదొక్కుకోవడానికి ప్రణాళిక వేశారు. ప్రపంచంలో స్టార్టప్ లకు భారత్ నాలుగో అతిపెద్ద కేంద్రం. దేశంలో స్టార్టప్ లు స్ధాపిస్తున్న వారిలో 73 శాతం మంది 36 ఏళ్లలోపు వారే. 2020 నాటికి దేశంలో స్టార్టప్ ల సంఖ్య 11,500కి చేరే అవకాశముంది. ఈ కంపెనీలు 2 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. 28 శాతం స్టార్టప్ లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది బెంగళూరు. ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 24 శాతం ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ల శాతం 8. అయితే ప్రపంచంలో మొదటి మూడు స్థానాల్లో 41,500 స్టార్టప్ లతో తొలి స్థానంలో అమెరికా, 3,500తో రెండో స్థానంలో బ్రిటన్, 3,300తో మూడో స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. ఇలా ఎన్నో అంశాలపై అధ్యయనం చేశారు కేటీఆర్. అబ్బురపరిచే సౌకర్యాలతో టీ హబ్ బిల్డింగ్‌ ను డిజైన్ చేయడంలో ఆయన పాత్ర కూడా కీలకమైనదే. టీ హబ్‌ తో దేశంలో ఎంతోమంది ఔత్సాహిక యువతకు అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆకాంక్షిస్తున్నారు కేటీఆర్. యంగ్ ఇండియా ప్రపంచానికి చాలెంజ్ చేస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

 

Don't Miss