యాక్టర్‌కే సినిమా చూపించారు : ఆన్‌లైన్‌లో నకిలీ ఐఫోన్

16:09 - December 3, 2018

అతని పేరు నకుల్. ప్రముఖ నటి దేవయాని సోదరుడు. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ మూవీలో జెనీలియా సోదరుడిగా నటించాడు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవలే నకుల్.. ఐఫోన్ XS MAX ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేశాడు. నవంబర్ 30వ తేదీని డెలివరీ అయ్యింది. డిసెంబర్ 1వ తేదీ ఓపెన్ చేశాడు నకుల్. అంతే షాక్.. ఫోన్ చూడటానికి చక్కగా ఉంది.. ఆన్ చేస్తే అసలు విషయం బయటపడింది.
ఆన్ చేస్తే చైనా భాష : ఐఫోన్ డూప్ అది
ఫోన్ ఆన్ చేసిన నకుల్ కు.. చైనా భాష కనిపించింది. ఐపోన్ ఆప్షన్స్ ఉన్నా.. ఆపరేటింగ్ మాత్రం పిచ్చిపిచ్చిగా ఉంది. ఫోన్ అంతా ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంది. ఎయిర్ బబుల్స్ వచ్చి ఉన్నాయని వీడియో సాక్ష్యంగా పోస్ట్ చేశాడు నకుల్. ఒక లక్ష 25వేల రూపాయలు చెల్లించానని వెల్లడించారు యాక్టర్ నకుల్. ఫోన్ తీసుకెళ్లాలని కాల్ చేసినా రెస్పాన్స్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్లిప్ కార్ట్ కు మెయిల్ చేశానని.. 12 రోజుల్లో ఫోన్ కలెక్ట్ చేసుకుంటామని రిప్లయ్ ఇచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫోన్ అంతా ప్లాస్టిక్ తో తయారైందని.. అసలు - నకిలీ ఐఫోన్ కు తేడా ఏంటో చూపిస్తూ కూడా ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అమెజాన్ లో వచ్చిన ఐఫోన్ - ఫ్లిప్ కార్ట్ ద్వారా వచ్చిన ఐఫోన్ తేడాను చూపిస్తూ కూడా ఓ ఫొటో రిలీజ్ చేశాడు నకుల్ జయదేవ్.
భార్యకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే.. బురిడీ కొట్టించారు :
మూడో పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా.. తన భార్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని iphone XS MAX బుక్ చేసినట్లు తెలిపాడు. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసి మోసపోయాను అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టు పెట్టాడు. అసలే నటుడు.. ఆపై నకిలీ ఐఫోన్.. కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపై ఫ్లిప్ కార్ట్ ఇంకా స్పందించలేదు.

Don't Miss