గూగుల్ ప్లస్ సేవలు నిలిపివేత

13:15 - October 9, 2018

కాలిఫోర్నియా: డేటా లీక్.. సోషల్ మీడియాకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. గతంలో ఫేస్‌బుక్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. డేటా లీక్ వ్యవహారంలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్‌ ప్లస్‌కు ఈ సమస్య ఎదురైంది. గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తెలుస్తోంది. గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్‌ అయ్యుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్‌ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్‌ ప్లస్‌ కార్పొరేట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఈ వ్యవహారంపై స్పందించిన గూగుల్..
గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదని తెలిపింది. అసలు ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని వివరణ ఇచ్చింది. కాగా విచారణ సంస్థలకు భయపడి గూగుల్‌ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

Don't Miss