అమరావతి జనతా గ్యారేజ్

17:47 - November 5, 2018

గుంటూరు: "జనతా గ్యారేజ్" ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ సినిమా, దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అని ఉంటుంది. వాస్తవానికి ఇది మెకానిక్ షెడ్ అయినా "సామాన్యులు ఇక్కడికెళ్లి  ఏ సమస్య చెప్పుకున్నా పరిష్కారం అవుతుందని" సినిమాలో చూపించారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రదీప్ అనే వ్యక్తి జనతాగ్యారేజ్ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేను సెటిల్ చేస్తానని 2 నంబర్లు ఇచ్చి గ్రూప్స్ లో మెసేజ్ పంపించాడు. దాంతో అతని గ్రూప్ లో కొందరు చేరారు. ఈరోజు ఉదయం గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ఆధారంగా ఉండవల్లిలోని ఒక ఇంటివద్ద సెటిల్ మెంట్ చేయడానికి తన మిత్రులతో కలిసి కత్తి పుచ్చుకువచ్చి అరుస్తూ హాడావిడి చేశాడు. అతని చేతిలో కత్తి చూసి స్ధానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఇతడిపై ఏమైనా నేరచరిత్ర ఉందా,లేదా అనేది పోలీసు విచారణలోతేలాల్సి ఉంది.

Don't Miss