మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న సందిగ్ధత

08:09 - November 5, 2018

హైదరాబాద్ : మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఓవైపు కాంగ్రెస్‌కు కూటమి పక్షాలు డెడ్‌లైన్‌ విధిస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. సీట్ల పంపకాలలో భాగంగా ఇవాళ టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూటమి పక్షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. 

మహాకూటమి సీట్ల సర్దుబాటుపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఇప్పటికే సీపీఐ, టీజేఎస్‌లు కాంగ్రెస్‌ను కోరాయి. మరోవైపు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు జరిపినా.. ఇంకా కొలిక్కి రాలేదు. 

సీట్ల సర్దుబాటుపై ఇవాళ మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలతో టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఏయే స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలన్న అంశంపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశముందని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. 

ఇక కూటమి నేతలతో భేటీ అనంతరం.. ఉత్తమ్‌తో పాటు.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏఐసీసీ తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితాను పరిశీలించనుంది. ఈ జాబితాను బుధవారం రాహుల్‌, సోనియా, కుంతియాలతో కూడిన కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదం తర్వాత.. ఈనెల 8న లేదా 9న కాంగ్రెస్‌ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి సీట్ల సర్దుబాటు, స్థానాల ఖరారుతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితాతోనే ఉత్తమ్‌ తిరిగి హైదరాబాద్‌ వస్తారని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.

Don't Miss