మరో ఆర్థికమాంద్యం..రెడీగా ఉండండి - ఐఎమ్ఎఫ్

15:32 - October 6, 2018

వాషింగ్‌టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో ఆర్థికమాంద్యాన్ని చవిచూడబోతోంది. 2008 సంవత్సరంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ హెచ్చరించింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మరో పెనుముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. ఆయా దేశాధినేతలు బ్యాంకుల సంస్కరణలను అమలుచేయడంలో అవలంభిస్తున్న నిర్లక్ష్యమే ఈ రాబోయే ప్రమాదానకి కారణమని ఐఎమ్ఎఫ్ అధికారులు పేర్కొంటున్నారు.  ప్రధానంగా రుణాల స్థాయి 2008 స్థాయికంటే పెరగడం ప్రధాన సమస్యగా చెబుతున్నారు. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రమాదపూరిత లావాదేవీలను అదుపుచేయలేకపోవడంతో గ్లోబల్ స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని వాషింగ్‌టన్‌కు చెందిన ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

గత పదేళ్లలో బ్యాంకుల ద్రవ్యనిల్వలను పెంచేందుకు ప్రయత్నాలు జరిగినా.. అలాగే ఆర్థిక రంగంలో కొన్ని కఠిన పర్యవేక్షణలు చేపట్టినా.. నష్టాలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, అస్థిరతను అదుపుచేసే యత్నాలు కొత్త రంగాలకు ఎగబాకే ప్రమాదం ఉందని ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. కాబట్టి ఆర్థిక పర్యవేక్షకులు జరగబోయే పరిణామాలను జాగురూకతతో గమనించి చర్యలు తీసుకోవాలని సూచించింది.   

Don't Miss