కడపలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం

19:09 - November 6, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతిలో సమావేశం అయ్యింది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లాలో 18 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 మిలియన్ టన్నుల సామర్ధ్యం కల ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నెలరోజుల్లో మంచి రోజు చూసుకుని ముఖ్యమంత్రి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేయనున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. కడప స్టీల్ప్లాంట్ నిర్మాణంపై ప్రధానికి ఒక లేఖ రాయాలని, అలాగే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చటం లేదని మరో లేఖ రాయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  తిత్లీ తుపాను సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు కేంద్ర సాయం కోరగా, కేంద్రం కేవలం రూ.229 కోట్లు ఇవ్వటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కేబినెట్ ఈమేరకు హోం మంత్రికి నిరసన తెలుపుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. రామాయపట్నం పోర్టు, అన్న క్యాంటిన్లు ఏర్పాటు, రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటు, గ్రామీణ నీటి సరఫరా కోసం నిధుల సమీకరణ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు అంశాలపైన మంత్రివర్గంలో చర్చించారు. 

Don't Miss