రాహుల్‌తో భేటీ, జగన్‌పై దాడి.. వీటిపైనే ప్రధాన చర్చ

13:12 - November 6, 2018

విజయవాడ: ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో జగన్‌పై దాడి వ్యవహారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌తో భేటీ.. రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ అజెండాలో లేని అంశాలపై కూడా ఈ సందర్బంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఏలూరు, ఒంగోలు, కడప కార్పొరేషన్లను అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిలకలు సిద్దం చేసింది. ఇప్పటికే మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇక మంత్రివర్గ సమావేశంలో ఏపీ అసైన్‌మెంట్‌ యాక్ట్‌-1977కు చట్ట సవరణ అంశంపై చర్చించనున్నారు. ఇప్పటివరకు అసైన్డ్‌ భూములు కొనుగోలు, అమ్మకాలపై నిషేధం ఉంది. కానీ చట్టసవరణ వలన అసైన్‌మెంట్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కొనుగోలు, అమ్మకాలపై నిషేధం తొలిగిపోనుంది. దీంతో అనేకమందికి లబ్ధి చేకూరనుంది. 

Image result for rahul gandhi chandrababuఇక ఇనామ్‌ యాక్ట్‌ చట్ట సవరణ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, ప్రధానమంత్రి గృహ నిర్మాణాలకు కొనుగోలు చేసే భూములకు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల మినహాయింపు ఇవ్వనుంది.
ఇక ప్రకాశం జిల్లాలో దొనకొండలో ఏఐసీసీకి దొనకొండ ఇండస్ట్రియల్‌ మెగా హబ్‌ నిర్మాణం కోసం దాదాపు 2400 ఎకరాల భూములకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటికే అన్న క్యాంటీన్ల వలన ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో.. వాటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వాటి నిర్మాణం మున్సిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థకు ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇక విశాఖ జిల్లా కాపులపాడులో వెస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు 110 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 

ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందుగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించేవారు చంద్రబాబు. కానీ.. సమన్వయకమిటీ సమావేశం లేకపోవడంతో మంత్రివర్గ సమావేశం అనంతరం జరగనున్న పొలిటికల్‌ భేటీలో అనేక అంశాలపై చర్చించనున్నారు. బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకం చేసే విధంగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటించడం... ప్రధానంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కావడం లాంటి అంశాలకు గల రాజకీయ ప్రాధాన్యతను సహచర మంత్రులకు సీఎం వివరించనున్నారు.

Image result for attack on jaganఅలాగే రాష్ట్రంలో సంచలనంగా మారిన జగన్‌పై దాడి వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను సీఎం మంత్రులకు వివరించే అవకాశం ఉంది.

 

Don't Miss