జగన్, పవన్, కేసీఆర్, మోడీలకు చంద్రబాబు వార్నింగ్..!

10:07 - November 3, 2018

ప్రకాశం: సేవ్ నేషన్.. సేవ్ డెమోక్రసీ నినాదంతో బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బరిలోకి దిగిన ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మరోసారి కేంద్రం, విపక్షాలపై ఫైర్ అయ్యారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరి తాను కేంద్ర ప్రభుత్వానికి భయపడే సీఎంను కాదని, తిరగబడి వారిపై పోరాటం చేసి వారి మెడలు వంచే వ్యక్తిని అంటూ చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏపీపై దాడులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శినిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు, పొరుగు రాష్ట్రం సీఎంపై నిప్పులు చెరిగారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినందుకే టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అయినా తాను వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. తాను భయపడే సీఎంను ఎంతమాత్రం కాదని, కేంద్రంపై తిరగబడి సాధించుకునే సీఎంనని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను బంగారుమయం చేసి అందిస్తే, కేసీఆర్ పాలించుకోలేకపోతున్నారని, పైగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా కాళ్లరిగేలా తిరిగి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని గుర్తుచేసుకున్నారు. 

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానని, ఏపీని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు నిద్రపోనని భావోద్వేగంతో చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామాతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా నన్నే తిడుతున్నారన్న చంద్రబాబు.. ఏపీ విభజన హామీల అమలుపై నిజనిర్ధారణ కమిటీ వేశామని చెప్పిన పవన్, ఆ కమిటీని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.  

కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకే తాను ఢిల్లీలో పర్యటించి ఎన్డీయేతర పార్టీల నేతలతో కీలక భేటీలు నిర్వహించి, మద్దతు కూడగడుతున్నానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షానికి ప్రజలను ఓట్లు అడిగే హక్కుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక వర్గాలను చూసి ఓట్లేయవద్దని, కేవలం అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలంటూ ఏపీ సీఎం సూచించారు.

Don't Miss