పార్టీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచ‌న

14:36 - October 5, 2018

విజ‌య‌వాడ‌: ఏపీలో టీడీపీ నేత‌లు టార్గెట్ గా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. అందుబాటులో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌తో అత్యవ‌స‌రంగా స‌మావేశం అయిన సీఎం చంద్ర‌బాబు.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయించ‌డం బీజేపీకి అల‌వాటేన‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఎన్ని కుట్ర‌లు చేసినా ఏపీని ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల నేప‌థ్యంలో పార్టీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నామని...రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఏపీలోని త‌మ పార్టీ నాయకులకు చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉంద‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, వ్యాపార‌వేత్తలు, సీఎం చంద్ర‌బాబుకి స‌న్నిహితులైన బీదా సోద‌రులు, మంత్రి నారాయ‌ణకు చెందిన సంస్థ‌ల్లో ఐటీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఈ  సోదాల్లో ఆ శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి సంబంధించినవిగా చెప్పుకుంటున్నారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఒక సంస్థ అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం.

టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. బీదా మస్తాన్ రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని ఆయ‌న  మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై కూడా పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Don't Miss