కాంగ్రెస్ ఇంటింటి కార్యక్రమానికి దూరంగా ముఖ్యనేతలు

08:50 - November 3, 2018

విజయవాడ: ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తోన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయా..? పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నానా తంటాలు పడుతోందా..? ఇంటింటికి  కాంగ్రెస్ కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉందా..? కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు దూరంగా ఉంటున్నారా..?  అంటే అవుననే సమాదానం వస్తోంది.

బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాల్లోకి వెళ్లి వివరిస్తామంటూ బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నేతలకు భంగపాటు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి ఆ పార్టీ ముఖ్య నేతలు అంటీ ముట్టనట్టుగా హాజరవుతుండడంతో....ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టోను ప్రజల్లోకి క్షేత్రస్ధాయిలో  తీసుకెళ్లలేక పోతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అధిష్టానం కలసి కట్టుగా ప్రచారం చేయాలని ఆదేశించినా అక్టోబర్ 2న శ్రీకాకుళం నుంచి రఘువీరా, ఏలూరు నుంచి రాష్ట్ర  వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంది ప్రారంభించడం చర్చకు దారితీసింది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో...ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనకపోవడం ప్రధాన చర్చకు దారితీసింది. చిరంజీవి సినిమా షూటింగ్‌లో బిజీగా మారడంతో కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మరికొంతమంది నేతలు కూడా దూరంగా ఉండడంతో...నేతలంతా కార్యక్రమంలో పాల్గొనాలని అందుకు నవంబర్ 19 వరకు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు రఘువీరా ప్రకటించారు. 

మరి మిగిలిన రోజుల్లోనైనా పార్టీ ముఖ్య నేతలు ఇంటింటికి కాంగ్రెస్ కార్యాక్రమంలో పాల్గొంటారా...క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్వ వైభవం కోసం ఏ మేరకు కృషి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Don't Miss