ఏఆర్ రెహమాన్ : 25 ఏళ్లు వచ్చేవరకు ఆత్మహత్య ఆలోచనలే..

13:57 - November 5, 2018

ముంబై: భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్‌లో ఎదురైన అనుభవాలను, పాత జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. తన 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచలు వచ్చేవని రెహమాన్ వెల్లడించారు. 9 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కొల్పొయిన తర్వాత ఎదురైన పరిణామాలు తనను ఆ దిశగా ఆలోచించేలా చేశాయన్నారు. కంపోజర్‌గా కెరీర్ ప్రారంభించిన తాను అప్పట్లో ఫెయిల్ అయ్యాయని. దీనికి తోడు కుటుంబ బాధ్యతలు.. తండ్రి మరణం.. ఎన్నో కష్టాలు.. వీటిని ఎదుర్కొలేక తన జీవితం ఇక ముగించాలని భావించేవాడినని తెలిపారు. కానీ తన ప్రయాణం తనకు చాలా నేర్పిందన్నారు. సంగీతం తన జీవితంలో మార్పు తెచ్చిందన్నారు. చావు అనేది అనివార్యమైనా.. సమస్యకు పరిష్కారం కాదని గుర్తించానని చెప్పారు. జీవితంలో దేనికీ పనికిరాము అని ఎవరూ అనుకోకూడదని రెహమాన్ సూచించారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని 25ఏళ్ల వయసులో తెలుసుకున్నట్లు రెహమాన్ తెలిపారు.

కృష్ణ త్రిలోక్‌ రచించిన రెహమాన్‌ బయోగ్రఫీ ‘నోట్‌ ఆఫ్‌ ఏ డ్రీమ్‌: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహమాన్‌’ పుస్తకాన్ని శనివారం రోజున ముంబైలో అవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన 12 నుంచి 22 ఏళ్ల వయస్సులోనే జీవితంలో అన్ని కోణాలను చూశానని రెహమాన్ చెప్పారు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్న తాను చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిపోయానని చెప్పారు. 

తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహమాన్‌గా మారిందని ఆయన వివరించారు. ఎందుకు ఇష్టం లేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదని రెహమాన్ అన్నారు.

Don't Miss