కేసీఆర్ పాలనలో ముస్లింల నిజమైన అభివృద్ధి జరుగుతోంది - ఓవైసీ

11:57 - November 5, 2018

సంగారెడ్డి: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. టీఆర్‌ఎస్ పాలనలో ముస్లింల నిజమైన అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించిందన్నారు. 204 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిందన్నారు. పేద ముస్లింలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ముస్లిం విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ కూడా ఇస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను బలపరుస్తూ ఎంఐఎం ఏర్పాటు చేసిన బహిరంగసభకు అసదుద్దీన్ ఓవైసీ హాజరై మాట్లాడారు. 

మైనార్టీల అభివృద్ధి విద్యద్వారానే సాధ్యమని భావించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 204 ఇంగ్లిషు మీడియం గురుకులాలు ఏర్పాటుచేశారని, వీటిల్లో 50వేల మంది ముస్లిం బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారని ఓవైసీ చెప్పారు. రూ.750 కోట్లతో 12 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు. ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. ఇన్ని చేస్తున్న కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓట్లువేసి గెలిపించి అధికారం అప్పజెప్పితే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఓవైసీ అన్నారు.

గత ప్రభుత్వాలు ఉర్దూ భాషను పట్టించుకోలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఉర్దూ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఓవైసీ కితాబిచ్చారు. మసీద్ ఇమామ్‌లకు ప్రభుత్వం తరుపున వేతనం ఇస్తున్నారని, పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారని వెల్లడించారు. దేశంలో మతఘర్షణలు జరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం గడచిన నాలుగున్నరేళ్లలో ఎలాంటి మత వివాదాలు తలెత్తలేదని ఓవైసీ గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు నియంత్రణలో ఉన్నాయని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓవైసీ సెటైర్లు వేశారు. చార్మినార్ వద్ద రాహుల్ సభకు రెండు వేల లోపే జనం వచ్చారన్న ఓవైసీ.. అదే చార్మినార్ వద్ద నాతో సెల్ఫీ దిగమంటే కనీసం 10వేల మంది వస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తమపై విమర్శలు చేస్తున్నాడని.. 'భారత దేశంలో మేమూ భాగమే.. కిరాయి వాళ్లం కాదు కదా' అని ఓవైసీ బదులిచ్చారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి గెలిపించుకోవాలని, మైనార్టీలను వంచించిన పార్టీలకు ఓటువేయొద్దని ఓవైసీ పిలుపునిచ్చారు.

Don't Miss