గాలి జనార్ధన రెడ్డిపై లుక్-ఔట్ నోటీసులు జారీ చేసిన బెంగుళూరు పోలీసులు

21:08 - November 7, 2018

బెంగుళూరు: బళ్లారి మైనింగ్ బ్యారన్, కర్ణాటక మాజీ పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు గాలి జనార్ధనరెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. కాకపోతే ఈసారి ఆయన మైనింగ్ కేసులో కాదు, రూ.18కోట్ల ముడుపుల కేసులో సిటీ క్రైం బ్రాంచ్(సీసీబీ) పోలీసులు ఆయన్ని విచారించనున్నారు. ఆయనపై బెంగుళూరు పోలీసులు లుక్-ఔట్ నోటీసులు జారీచేశారు. 
బెంగుళూరు పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ బుధవారం జరిగిన విలేకరుల సమావేశం లోచెప్పిన వివరాల ప్రకారం ...."సయ్యద్ అహ్మద్ ఫరీద్‌ అనే వ్యక్తి  2016-17లో ఆంబిడెంట్ గ్రూప్‌ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. నెలకు 30 నుంచి 40 శాతం లాభాలు ఇస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి. వారివద్ద నుంచి సుమారు రూ.600 కోట్ల మేరకు వసూలు చేశాడు. కొన్ని నెలల తర్వాత  పెట్టుబడి దారులకు లాభాలు ఇవ్వలేక పోవటంతో కొందరు పెట్టుబడిదారులు ఫరీద్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు డీజే హళ్లి పోలీసు స్టేషన్ లో ఫరీద్ పై కేసు నమోదు చేశారు.  కేసులో భాగంగా 2017 జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) కంపెనీలో సోదాలు చేసి విలువైన పత్రాలును స్వాధీనం చేసుకుంది. 
ఫరీదును విచారించగా.. ఈకేసు నుంచి బయటపడేయటానికి గాలి జనార్ధనరెడ్డితో రూ.18 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పాడు. ఫరీద్ రూ.18 కోట్లను గాలి సూచనల మేరకు మధ్యవర్తులకు అందచేశాడు. మొదటగా రూ.18 కోట్లను రమేష్ కొఠారీ అనే బంగారం వర్తకుడికి ఇవ్వగా, రమేష్ ఆసొమ్ముతో 57 కేజీల బంగారాన్నికొని జనార్దన్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న అలీఖాన్‌ సూచనల  మేరకు బళ్లారికి  చెందిన రాజ్‌మహల్‌ జ్యూయలర్స్ యజమాని రమేష్ కి పంపించినట్లు తెలిపాడు.  
గత కొద్దిరోజులుగా వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతుండటంతో పోలీసులు విచారణ వేగం పెంచారు. విచారణలో భాగంగా రమేష్ కొఠారిని, రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వీరి బ్యాంకు ఖాతాలను జప్తు చేసారు. కాగా ఈకేసులో గాలి జనార్ధన రెడ్డి ఈడీ అధికారులకు లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు నమోదయ్యాయని ఒక వార్తా సంస్ధ తెలిపింది. కేసు విచారణ గమనించిన గాలి జనార్ధనరెడ్డి పరారయ్యారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన్నుఅరెస్టు చేసేందుకు బెంగుళూరులోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసులు డూప్లికేట్ తాళంతో తెరిచి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు లుక్-ఔట్ నోటీసులు జారీచేశారు. మరో వైపు ఏసీపీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని ఒక బృందం తెలంగాణాలో గాలిజనార్ధన రెడ్డి కోసం గాలిస్తోంది. 

 

Don't Miss