బీఎల్ఎఫ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

14:21 - November 3, 2018
కామారెడ్డి : ఓట్ల కోసం రాజకీయ నేతలు పడరాని పాట్లు పడతారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగేవారు కొందరైతే.... డప్పు కొట్టి, డ్యాన్స్‌ చేసేవారు ఇంకొందరు. కానీ ’నాకు ఓటు వేయకండి’ అని మైకుపట్టి ప్రచారం చేస్తున్నాడు ఓ అభ్యర్థి. అంతేకాదు ఓటు వేయవద్దని ప్రచార రథానికి సైతం బ్యానర్లు కట్టుకని మరీ గ్రామాల్లో తిరుగుతున్నాడు.
 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి భారత్‌ వాగ్మారే వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. నాకు ఓట్లు వేయకండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ’ఓటు వేయకండి... కాని ఒక్కసారి నా స్పీచ్ విని నిర్ణయం తీసుకోండి’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతే కాదు ప్రచార రథానికి సైతం ఓటు వేయవద్దనే బ్యానర్‌ను కట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు.
 
తాను డబ్బులు, మద్యం పంపిణీ చేయనని భారత్‌ వాగ్మారే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే.. రెడ్డి సీఎం అవుతారని.. టీఆర్‌ఎస్‌కు వేస్తే వెలమ ముఖ్యమంత్రి అవుతారని.. అదే బీఎల్‌ఎఫ్‌కు ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని భారత్‌ వాగ్మారే చెప్పుకొచ్చారు.
 
ఇంతగా చెప్పిన వాగ్మారే.. రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ గెలిచే స్థానాలు 20 మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం వస్తే.. తామే కింగ్‌ మేకర్‌మవుతామని చెప్పుకొచ్చారు. కర్నాటకలో వచ్చిన పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందని వాగ్మారే కలలు కంటున్నారు. మొత్తానికి తనకు ఓటు వేయవద్దంటూనే.. భారీ మెజార్టీతో గెలుస్తానని వాగ్మారే చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. 

Don't Miss