కాంగ్రెస్‌కు మాజీ మంత్రి రామచంద్రయ్య రాజీనామా

11:50 - November 3, 2018

కడప: ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ కారణంతోనే ఇప్పటికే వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మొదటి నుంచి తాను చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు రామచంద్రయ్య చెప్పారు. విభజన సమయంలో చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు తాను మరిచిపోలేనని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎన్ని నాటకాలైనా ఆడతారని రామచంద్రయ్య విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు - విడిపోతారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఈ రోజు ఈ గతి పట్టడానికి కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సి. రామచంద్రయ్య చెప్పారు.

జిల్లాలో రామచంద్రయ్య కీలక నేతగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన..  ఏ పార్టీలో చేరతారో చూడాలి.

మొత్తంగా ఏపీ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ - కాంగ్రెస్ కలయికను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా పలువురు రాజీనామా  యోచనలో ఉన్నట్టు సమాచారం. 

Don't Miss