సీబీఐ X సీబీఐ కేసు (10 పాయింట్లు)

15:07 - October 23, 2018

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

  1. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా - 1984  బ్యాచ్ గుజరాత్ కు చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి.  గత ఏడాది అక్టోబర్  22 న సీబీఐ లో ప్రత్యక డైరెక్టర్‌గా  నియమితులయ్యారు. ప్రధాని మోడీ స్వయంగా ఆయన్ను  ప్రత్యేక అధికారిగా నామినేట్ చేశారన్న వార్తలు ఉన్నాయి. గతంలో  గోద్రాలో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనకాండ కేసు దర్యాప్తు చేశారు. సీబీఐలో ఆయన్ను నియమించినప్పుడు లోకాయుక్త చట్టాలు ఉల్లంఘించి  ఆయన్ను నియమించారని పిల్  దాఖలైంది. ఈ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ రూ 3.8 కోట్లు లంచం తీసుకున్నానని ఆరోపిస్తూ తనను ఈ కేసులో ఇరికించారని కేంద్ర విజిలెన్స్‌  కమిషన్‌ (సీవీసీ)కి ఆస్థానా లేఖ రాశారు.
  2. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ - ఈయనకు ఆస్థానాతో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆస్థానాకు సీబీఐ డైరక్టర్ గా పదోన్నతి రావడంతో విబేధాలు మరింత పెరిగాయి. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ అనే కంపెనీ డైరీలో ఒక చోట రూ.3.8 కోట్లను ఆస్థానాకు చెల్లించినట్లు ఉండడాన్ని కారణంగా చూపించి, ఆయన పదోన్నతిని అడ్డుకునేందుకు  అలోక్‌వర్మ ప్రయత్నించడంతో ఇద్దరు అత్యున్నతాధికారుల మధ్య వైరం మరింత పెరిగింది. అప్పటి నుంచి పలు కేసుల విచారణలో, అంతర్గత బదిలీల్లో వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు  చేసుకుంటున్నాయి.
  3. సీబీఐ డీఎస్పీ  దేవేందర్ కుమార్ - మాంసం ఎగుమతుల వ్యాపారి  మొయిన్  ఖురేషికి సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారిగా దేవేందర్ వ్యవహరించారు. ఆ కేసులో  హైదరాబాద్‌కు చెందిన సానా సతీష్ బాబు  వాంగ్మూలం నమోదు చేయటంలో  ఫోర్జరీకి పాల్పడ్డారు. ఆస్ధానా  నేతృత్వంలో  సెప్టెంబరు 26, 2018న  సతీశ్ బాబు వాంగ్మూలం రికార్డు చేసినట్లు చెపుతున్నా.. వాస్తవానికి సతీశ్ బాబు ఆరోజు హైదరాబాద్‌లోని ఒక  హోటల్‌ లో  ఉన్నట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఫోర్జరీ ఆరోపణలపై సీబీఐ దేవేందర్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం జైలు నుండి తన అరెస్టును సవాలు చేస్తూ కోర్టులో మంగళవారం పిటీషన్ ధాఖలు చేశారు.
  4. సానా సతీష్ బాబు, వ్యాపారి - ఈయన మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడైన ఖురేషీకి లావాదేవీల్లో భాగంగా రూ 50 లక్షల సొమ్ము 2011 లో ఇచ్చాడు. మాంసం ఎగుమతులు, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్టక్చర్ వ్యాపారి అయిన . మొయిన్ ఖురేషిపై  హవాలా కేసుకు సంబంధించి సీబీఐ దాడులు చేసింది.  ఖురేషికి సతీష్ బాబు డబ్బు ఎందుకిచ్చారనే అంశంపై సీబీఐ  వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది ...  కానీ కేసు నుంచి తప్పించుకోటానికి సీబీఐ అధికారులకు, కొందరు మధ్యవర్తులకు రూ 5 కోట్లు ఇచ్చినా ఇంకా డబ్బుకోసం వేధిస్తున్నారని సీబీఐకి ఈ ఏడాది అక్టోబరు 15న సతీష్ బాబు ఫిర్యాదు చేశాడు. దాంతో సీబీఐ ఎంక్వైరీ  మొదలెట్టింది.   మొయిన్ ఖురేషిపై నమోదైన కేసులో అక్టోబర్ 12, 2017 న సీబీఐ ముందు హాజరుకావాలని సీబీఐ అధికారి దేవేందర్  నుంచి నోటీసు అందింది. అక్టోబర్ 23 తేదీన ఖురేషికి డబ్బులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఖురేషికి చెందిన ఇన్ ఫ్రా సంస్దలో పెట్టుబడిగా ఇచ్చినట్లు చెప్పాడు. ఇదే కేసులో ప్రశ్నించేందుకు తెలంగాణ  కాంగ్రెస్ నేత షబ్బీర్  ఆలీని  సీబీఐ పిలిపించింది.  సీబీఐ కేసునుంచి తప్పించుకోవడానికి రూ 5 కోట్లు ఇచ్చేందుకు సతీష్ సోమేష్ ప్రసాద్ అనే మధ్యవర్తితో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ సొమ్ము ఆస్థానాకు ఇవ్వాలని చెప్పాడు. ఇందులో రూ 3.55 కోట్లు చెల్లించాడు. అయినప్పటికీ సీబీఐ అధికారులు వేధించడంతో సీబీఐ ఉన్నతాధికారులకు వాట్సప్ మెసేజ్  ఆధారాలతో  ఫిర్యాదు చేశాడు. దీంతో లంచం తీసుకున్న సీబీఐ అధికారల మీద విచారణ మొదలయ్యింది.
  5. మధ్యవర్తి సోమేష్ ఒక సందర్భంలో రాకేష్ ఆస్థానాతో కూడా డీల్ మాట్లాడుతున్నట్టు సతీష్‌కు చెప్పి ఆధారాలు చూపించాడు. ఆ నమ్మకంతో సతీష్ విడతల వారీగా లంచం సొమ్ము చెల్లించడం ప్రారంభించాడు.  
  6. ఈ కేసుని డీల్ చేసిన సీబీఐ అధికారులు ఆస్థానా అరెస్టుకు కూడా రంగం సిద్ధం అయ్యింది. అయితే మోదీ ఆశీస్తులతో కేసునుంచి బయటపడతారా అన్నది తేలాల్సి ఉంది. కాగా .... ఈకేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మంగళవారం ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 
  7. సీబీఐ ఉన్నతాధికారులైన రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరడంతో దేశ ఉన్నతమైన విచారణ సంస్థ పరువు బజారున పడింది. వీరి మధ్యలో ఇరుక్కున్న దేవేందర్ అరెస్టుతో వీరిద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
  8. ఈ కేసులో సీబీఐ అధికారులు రాకేష్ ఆస్థానాతొ పాటు ఆలోక్ వర్మపైనా విచారణ జరగాల్సి ఉంది.
  9. బీజేపీ సర్కారుకు ఈ కేసు ఓ సవాల్‌గా మారే అవకాశం లేకపోలేదు.
  10. సీబీఐ సంస్థ పంజరంలో చిలుక లాగా ఉందని యూపీఏ హయాంలో అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్డీఏ సర్కర్ కూడా అదే బాటలో పయనిస్తోందని దేశ ప్రజలు అర్థం చేసుకొనే పరిస్థితి ఈ కేసు తీసుకువచ్చిందనేది వాస్తవం.

Don't Miss