బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ బ్రేక్‌

13:23 - October 4, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ కోడ్ పేరుతో బ్రేక్‌ వేసింది. ఆన్‌ గోయింగ్‌ పథకాలకు అడ్డు ఉండదని పార్టీ భావించి.. బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. దీంతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న రైతుబంధు చెక్కుల పంపిణీ పరిస్థితి ఏంటోనన్న టెన్షన్‌ నెలకొంది. 

తెలంగాణలో శాసనసభ రద్దు అయి దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సీఎం కేసీఆర్‌.. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టకపోయినా పాత పథకాలన్నీ యధావిధిగా కొనసాగుతాయన్నారు. అయితే ప్రభుత్వం రద్దు అయిన నాటి నుండి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పాత పథకాల కొనసాగింపు సందిగ్ధతలో పడింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రజాకర్షక పథకాలు నిలిపివేయాలని ఫిర్యాదులు చేశాయి. 

ప్రధానంగా ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులో బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కులు రెండో విడత పంపిణీ, కంటి వెలుగు, ప్రభుత్వ వాహనాల్లో తిరగడం, అధికార నివాసాల్లో ఉండడం, వారి వారి శాఖలకు సంబంధించిన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న మంత్రులపై ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో సహజంగా గత ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాలకు ఈ కోడ్‌ వర్తించదని నేతలు భావించారు. కానీ రాష్ట్ర ఈసీకి అందిన ఫిర్యాదును పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు రజత్‌కుమార్‌. ఈనెల 12 నుంచి 18 ఏళ్లు నిండి.. తెల్లరేషన్‌ కార్డు కలిగివున్న కోటి ఎనిమిది లక్షల మంది మహిళలకు ఇచ్చే చీరల పంపిణీ ప్రారంభానికి సిద్దమవుతున్న బతుకమ్మ చీరలపై సీఈసీ క్లారిటీ ఇచ్చింది. తక్షణమే బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని లేఖ పంపింది. 

ఇదిలావుంటే.. తెలంగాణలో రైతుకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిదివేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకంలో భాగంగా.. మొదటి విడత గత మే నెల 10న 4 వేల చొప్పున రైతులకు అందించారు. మలి విడత పంపిణీ ఈనెల 5 నుంచి ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అయితే.. దీనిపై కూడా ఈసీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చెక్కుల పంపిణీ సాధ్యమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

అయితే.. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఈసీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటు బతుకమ్మ చీరలు, రైతు బంధు పథకం రెండో విడత పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని కోరనున్నారు. మరి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది సందిగ్ధంగా మారింది. 

Don't Miss