సోషల్‌ మీడియాలో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు : ఈసీ

14:04 - October 4, 2018

హైదరాబాద్ : ఎన్నికల షెడ్యూల్‌కు సమయం ఆసన్నం కావడంతో.. ఎలక్షన్‌ కమిషన్‌ అప్రమత్తమైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థులను కట్టడి చేసేందుకు గట్టి నిఘా పెడుతోంది. ప్రజలను ప్రభావితం చేయడంలో మీడియాకు ధీటుగా.. సవాల్ విసురుతున్న సోషల్‌ మీడియాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సాధారణ ప్రజలకు అరచేతిలో అస్ర్తంలాంటి ఈ సైట్లపై సైబర్ నెట్ వర్క్స్ టీంతో పాటు.. నిపుణులతో పర్యవేక్షిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది.

ప్రజలను ప్రభావితం చేయడంలో మీడియాతో పోటి పడుతోంది సోషల్ మీడియా. ఏమాత్రం ఖర్చులేకుండా తమ అభిప్రాయాన్ని స్వేఛ్చగా చెప్పేందుకు అరచేతిలో అస్ర్తంలా మారింది. కానీ.. దీనికీ  కొంత హద్దు ఉందంటోంది ఎన్నికల కమిషన్. సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించిన ఈసీ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాజకీయ పార్టీలు ప్రత్యేక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో.. వాటి నియంత్రణకు నిఘాను ముమ్మరం చేసింది ఈసి. ఎక్కడేం జరిగినా క్షణంలో వైరల్ చేసేందుకు వీలుండడంతో.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్ స్ట్రా గ్రామ్, లింక్ డే ఇన్, వాట్పాప్‌పై దృష్టి పెట్టింది. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి పోస్టుకు ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులే కారణం అవుతారంటోంది ఈసీ. సానుకూల వార్తలు, షార్ట్ ఫిల్మ్‌ ఇలా ఏవైనా  అభ్యర్ధి ఎన్నికల ఖర్చులోకే జమ చేస్తామంటోంది.

కొందరు అకతాయిల పనులతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. ఫేక్ అకౌంట్స్‌తో ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కుల, మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించినా, రాజ్యాంగ సంస్థలను అగౌరవ పరిచినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తోంది ఈసీ. ఈ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియాకు వర్తించే చట్టాలే వీటికీ వర్తిస్తాయంటోంది.
 
సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలైంది. కానీ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులు ఇష్టానుసారం ప్రచారం చేస్తే కుదరదంటున్నారు అధికారులు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఈసీ. ముఖ్యంగా సోషల్ మీడియాను  అదుపు చేయాల్సిన అవసరం ఉందంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఇష్టానుసారం రెచ్చిపోవాలని చూసే.. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు ముకుతాడు వేసేందుకు సిద్ధమవుతోంది ఈసీ. ఎన్నికల కోడ్‌ను పట్టించుకోకుండా.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోయేవారు.. కఠినచర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

Don't Miss