రైతుల తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి కేంద్రం అంగీకారం

21:04 - October 2, 2018

ఢిల్లీ : రైతుల ఆందోలనలకు కేంద్రం దిగి వచ్చింది. రైతుల తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి కేంద్ర ప్రభుత్వం అంగీకారించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో.. రైతు సంఘాలతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. రైతు సంఘాల నేతలు పెట్టిన 9 డిమాండ్లలో ఏడింటిని అంగీకరిస్తామన్నారు. అయితే.. రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది.

మెజార్టీ డిమాండ్లను ఆమోదించడానికి సిద్ధపడినందున ఆందోళన విరమించాలంటూ కేంద్రం రైతులను కోరింది. అయితే కీలక డిమాండ్లైన రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో రైతులు నచ్చజెప్పేందుకు.. నేరుగా ఢిల్లీ-యూపీ సరిహద్దులకే కేంద్ర మంత్రులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

అంతకముందు అన్నదాతలు కదంతొక్కారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఢిల్లీ సరిహద్దులు మారు మ్రోగాయి. పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్‌తో అడ్డుకున్నా.. రైతులు వెన్నుచూపలేదు. అంతకంతకు భారమవుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Don't Miss