చైనాలో నకిలీ చందమామ..!

17:50 - October 20, 2018
బీజింగ్: రాజు తలుచుకంటే కొదువేముంది.. వింతలు విడ్డూరాలకు నిలయం చైనా. అనుకుంటే ఏదైనా సాధించేస్తారు. చైనా మరో అధ్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. అక్కడి ప్రజలు ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని రోజూ పాడుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే.. వీధి దీపాల కోసం కరెంటు బిల్లులు నెల నెలా తడిసి మోపెడవుతుండటంతో చైనా పాలకులు ఏకంగా ఒక చంద్రుడినే సృష్టించేస్తున్నారు. దీంతో పగలే వెన్నెల అన్న విధంగా నిత్యం చంద్రుడు అందుబాటులో ఉండి వెన్నెలను కుమ్మరిస్తూ ఉంటాడు. 2020 కల్లా నగర వీధులను చంద్రుని వెలుతురుతో నింపేదానికి చైనా శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం కృత్రిమ చంద్రుడిని ఆకాశం మీదకు అంటే ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు. మానవునిచే నిర్మితం కాబోతున్న చంద్రుడిని దేశ నైరుతీ భాగాంలోని సీచువన్ ప్రొవిన్స్‌లోని చెంగ్డూ నగరంలో ఈ అధ్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు. అది ఎలా అంటే.. వెలుగులు విరజిమ్మే శాటిలైట్‌ను ఆకాశంలో ప్రవేశపెడతారు. దీని మీద కాంతి పరావర్తనం చెంది నగరంమీదకు కాంతిని వెదజల్లుతుంది. ఈ శాటిలైట్ వీధిదీపాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు చంద్రుడు కాంతి కంటే  ఈ శాటిలైట్ ప్రసరించే కాంతి 8 రెట్లు అధికంగా ఉంటుందట. ఎందుకంటే ఇది చంద్రుడి కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి. ఒరిజినల్ చంద్రుడు 3.80 లక్షల కి.మీ ల దూరంలో ఉండగా.. ఈ కృత్రిమ చంద్రుడు భూమికి 500 కి.మీ దూరంలో ఆవిష్కరించనున్నారు. ఈ చంద్రుడుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో తెలుసుకోవచ్చు.

Don't Miss