నదులు అనుసంధానం చేసి మహాసంగమం సృష్టిస్తా: చంద్రబాబు

17:23 - October 10, 2018

అనంతపురం: శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయిదు నదులు అనుసంధానం చేసి మహాసంగమం  సృష్టిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భైరవానితిప్ప వద్ద కుందుర్పి ఎత్తిపోతల పధకానికి శంకుస్దాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గంటడికోటకు నీళ్లిస్తే పార్టీ ఉనికికి ప్రమాదమని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. 
ఈ రోజు రాయలసీమలో  అన్ని జిల్లాలకు నీళ్లివ్వగలుగుతున్నానని, తాను చేసే అబివృధ్ది పనులకు అడ్డుపడితే బుల్లెట్లా దూసుకుపోతానని చంద్రబాబు అన్నారు. ప్రతి సోమవారం నీరు-ప్రగతి మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని, సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని దాని మీద శ్రధ్దపెట్టానని ,ఇప్పటికి 60 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నానని వీటిలో 47 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని,గోదావరి,కృష్ణా, నదులు అనుసంధానం చేసామని, గోదావరి,పెన్నా నదుల అనుసంధానానికి చెందిన పనులు త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్య్తతులో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా వంశధార,నాగావళి,గోదావరి,కృష్ణ,పెన్నా,నదులు అనుసంధానం చేసి మహా సంగమాన్నిసృష్టిస్తానని  చంద్రబాబు అన్నారు.

Don't Miss