కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ హవా. బీజేపీకి ఎదురుగాలి

12:11 - November 6, 2018

బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి సత్తా చాటింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మూడు చోట్ల విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా.. ప్రతిపక్ష బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట ముందంజలో ఉంది. కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు(బళ్లారి, శివమొగ్గ, మాండ్య), రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు(రామనగర, జమఖండి) గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించారు. ఇవాళ కౌంటింగ్ చేపట్టారు. 

మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామగౌడ సమీప బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు. మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండిలో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్‌ విజయం సాధించారు.

ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ ఆధిక్యంలో ఉండగా.. మరో లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప లీడ్‌లో ఉన్నారు.

Don't Miss