నకిలీ నోట్లతో బంగారం కొనుగోలు చేసిన కిలాడీ దంపతులు

12:08 - October 25, 2018

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు. తీరా వారిచ్చిన నోట్లను పరిశీలించగా అవి ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’’ పేరుతో ఉన్న నకిలీ నోట్లగా గుర్తించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది.  
వివరాల్లోకి వెళితే.. ఓ జంట లుథియానాలోని ఓ జువెలరీ షాపుకు వెళ్ళారు. వారు 56 గ్రాముల బంగారం రూ. 1.90 లక్షలు పెట్టి ఖరీదు చేశారు. క్యాష్ పే చేశారు.. వెళ్ళిపోయారు. తీరా వాళ్లు వెళ్లిన తర్వాత చూసుకుంటే అవి నకిలీ నోట్లుగా గుర్తించాడు షాపు యజమాని శ్యామ్ సుందర్ వర్మ. దంపతులు నోట్లను పాలిథిన్ బ్యాగులో చుట్టి తెచ్చారు. లెక్క చూసిన తర్వాత డబ్బులు చెల్లించి వారు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ కిలాడీ దంపతులు కారులో వచ్చినట్టు గమనించారు. కనీసం కారు మీద రిజిస్ట్రేషన్ నెంబరు కూడా లేకపోవడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ దంపతుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. 

 

 

Don't Miss