తిత్లీ ఎఫెక్ట్.. రాలిన వృక్షాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

09:18 - October 11, 2018

శ్రీకాకుళం: నేలరాలిన భారీ వృక్షాలు, ఎగిరిపోయిన ఇళ్లపై కప్పులు, ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు.. తిత్లీ తుపాను బీభత్సం సష్టిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడుతోంది. ఈరోజు ఉదయం వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. దీంతో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పెనుగాలుల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉద్దానంతో పాటు పలాస, టెక్కలి, ప్రాంతాల్లో తుపాను బీభత్స దృశ్యాలు వణుకుపుట్టిస్తున్నాయి. భారీ శబ్ధాలతో పెనుగాలులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు.. భావనపాడు, ఉమిలాడ, సున్నాపల్లి తదితర తీర గ్రామాల్లో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురుస్తోంది. సంతబొమ్మాళి మండలం మరువాడలో సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి పది అడుగుల మేర కోతకు గురైంది. తుపాను బీభత్సానికి శ్రీకాకుళం.. ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, లావేరు, రణస్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, ఎచ్చెర్ల ప్రాంతాల్లోని తీర వాసులు గజగజలాడిపోతున్నారు.

మొత్తంగా తీరం దాటే వేళ పెనుగాలులు, భారీ వర్షంతో తిత్లీ విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగుల్లోకి భారీగా వరదనీరు రావడంతో, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేసిన అధికారులు, పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. సాయంత్రం వరకూ తిత్లీ విధ్వంసం కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే చత్తీస్ గడ్, తూర్పు తెలంగాణ వైపు తిత్లీ కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

తిత్లీ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపైనా కనిపించింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండగా, రహదారి ధ్వంసమైంది. రోడ్డు తెగిపోయి, సమీపంలోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.

Don't Miss