గాలిపటాలతో ఆడినందుకు నాన్న తిట్టాడని.. ఈ ఘాతుకం చేశాడు!

11:58 - October 11, 2018

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి.. ఎదిగిన కొడుకును ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురు హత్యగావించబడ్డారు. ఈ ఘటనలో మృతిచెందినవారు రియల్ ఎస్టేట్ వ్యాపారి మిథిలేష్ వర్మ, అతని భార్య సియా, వీరి 15 ఏళ్ల కుమార్తె. ఆ కుటుంబంలోని నాలుగో వ్యక్తి ఏమయ్యాడు అనే ప్రశ్న పోలీసుల్లో ఉదయించింది. వారి టీనేజి కొడుకు మృత్యువాతనుంచి తప్పించుకున్నారని పోలీసులు మొదట భావించారు. అయితే అతనే హంతకుడని ఊహించలేకపోయారు. 19 ఏళ్ళ సూరజ్ వర్మను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 
అతను చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. కారణం ఆగస్ఠు 15న గాలిపటాలు ఎగరవేస్తూ కాలేజీ ఎగ్గొట్టి చదువుని అశ్రధ్ద చేస్తున్నాడని సూరజ్ తండ్రి మిథిలేష్ వర్మ కొడుకు సూరజ్ వర్మను కొట్టాడు. పదేపదే తిట్లతో విసిగిపోయిన సూరజ్ తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లోవాళ్లకు గట్టిగా బుద్ధిచెప్పాలని అదే రోజు సూరజ్ నిశ్చయించుకున్నాడు. మంగళవారంనాడు సూరజ్ స్నేహితులతో బయటకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు ఓ కత్తి, కత్తెరలను కొనుక్కొని తెచ్చుకున్నాడు.
ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో పాత ఫోటో ఆల్బమ్‌లను చూస్తూ సరదాగా గడిపాడు. తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ముందుగా తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి తండ్రిని, తల్లి సియాను, 15 ఏళ్ల చెల్లెలును దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. తల్లి మేల్కొని కూతురును కాపేడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లి అరచినా భయపడక పదే పదే కత్తితో పొడిచి తల్లిని, చెల్లినీ చంపేశాడు. 
అనంతరం ఇంట్లో దొంగలు పడ్డారన్నట్టుగా సృష్టించేందుకు ఇల్లంతా సామానులు చిందరవందర చేసి.. ఆ తర్వాత కత్తిపై వేలుముద్రలను చెరిపేసాడు. రెండు గంటల అనంతరం చుట్టుపక్కలవారిని లేపి ఎవరో దొంగలు వచ్చి తన కుటుంబ సభ్యులను చంపేశారని కథ అల్లేశాడు. ఇంట్లో నగదు కానీ, విలువైన సామగ్రి అంతా అలాగే ఉండటంతో పోలీసుల దృష్టి సూరజ్ మీద పడించి. విచారణలో భయంకర నిజాలను వెల్లడించాడు. సూరజ్ తన 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనీ... గతంలో తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసి తరువాత దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. తరచూ తన గురించిన నిజాలను తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయటంతో చెల్లెలు పైనా సూరజ్ కక్ష పెంచుకున్నట్టు విచారణలో తెలిసింది. 
క్లూస్ టీం సభ్యులు వంటగదిలో కత్తిని శుభ్రం చేసినట్టుగా గుర్తించారు. సూరజ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. 

Don't Miss