వార్నింగ్: ఓటు వేస్తూ సెల్ఫీ దిగితే...

11:04 - December 3, 2018

హైదరాబాద్: ఇప్పటి యూత్‌కు సెల్ఫీల పిచ్చి బాగా ఉంది. మూడ్ వస్తే చాలు సెల్ఫీలు దిగేస్తున్నారు. ప్లేస్ ఏదైనా, సందర్భం మరేదైనా అస్సలు పట్టించుకోవడం లేదు. సెల్ఫీలు దిగడం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టడం.. వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. ఈ క్రమంలో సెల్ఫీలకు బాగా అడిక్ట్ అయిపోయారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఏం చేసినా అనేవాళ్లు లేరు కదా అని డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ దిగితే.. ఆ ఓటును రద్దు చేస్తారు.
పక్కన పడేస్తారు:
ఇలా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం 49ఎం(ఓటు రహస్యం) అనే నియమాన్ని ఉల్లంఘించడమే అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అంటే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. సో.. సెల్ఫీ పిచ్చోళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.. ఆ తర్వాత చింతించినా లాభం ఉండదు.
ప్రతి ఓటరు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన నిబంధనలు:
* నిబంధనల ప్రకారం పోలింగ్‌ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం.
* ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు అతడిని బయటకు పంపేస్తారు.
* ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను అని బూత్‌లో చెప్పడం కూడా నేరమే. వారిని ఓటు వేయనీయరు.
* దివ్యాంగులు ఓటు వేయడానికి సహాయకుడిగా ఒకరిని అనుమతిస్తారు.
* అదే వ్యక్తిని మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా అనుమతించరు.
* పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
* ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు డౌట్ వచ్చినా పోలింగ్‌ ఏజెంట్లు ప్రిసైడింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్‌ గది వరకు వెళ్లొచ్చు.
* అధికారి మాత్రమే అక్కడ ఏమీ జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు.
* ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్‌ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు.

Don't Miss