నీరవ్ మోడి ఆస్తులు జప్తు చేసిన ఈడీ

08:19 - October 26, 2018

ఢిల్లీ: భారతదేశంలో  పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడి కి చెందిన రూ.255  కోట్ల విలువైన వస్తువులను, ఆభరణాలను గురువారం హాంకాంగ్ లో జప్తు చేసినట్లు  ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మనీలాండరింగ్ చట్టం కింద తాత్తాలిక ఉత్తర్వులను జారీ చేశారు.  ఈ విలువైన వస్తువులను నీరవ్  తన దుబాయ్ కంపెనీల నుండి 26 షిప్ మెంట్ ల  ద్వారా హాంకాంగ్కు ఎగుమతి చేసినట్లు ఈడీ గుర్తించింది. హాంకాంగ్ లోని ఒక లాజిస్టిక్ కంపెనీ గొడౌన్ లో ఈవిలువైన వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.  వీటి విలువ, ఎవరు,ఎవరికి రవాణా చేశారు మొదలైన వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరించామని ఈడీ  వెల్లడించింది.  ఆస్తుల జప్తుకు సంబంధించిన కోర్టు ఆదేశాలను త్వరలో హాంకాంగ్ పంపిస్తామని  ఈడీ అధికారులు తెలిపారు.  పీఎన్బీ ని మోసం చేసిన కేసులో నీరవ్ మోడి కి చెందిన  రూ.4,774 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటి వరకు జప్తు చేసింది. 
2018 ఫిబ్రవరి 14వతేదిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు 14 వేల కోట్ల మేర కుంభకోణం వాటిల్లిందని ఆ బ్యాంక్ ప్రకటించింది.  నీరవ్ మోడి, ఆయన మేనమామ మెహల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన బోగస్ ఎల్ఓయూలను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డారని బ్యాంకు తెలిపింది. అయితే బ్యాంకు ఈ ప్రకటన చేయడానికి నెల రోజులకు ముందే నీరవ్ మోడి దేశాన్ని విడిచి పారిపోయాడు. నీరవ్ మోడి పీఎన్బీని  13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Don't Miss