యూత్‌ని ఆకట్టుకునే ఈ మాయ పేరేమిటో

15:27 - September 24, 2018

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల వారసులు హీరోలుగా మారడం అనేది సర్వసాధారణంగా జరిగేపనే. కానీ, టెక్నీషియన్స్ పిల్లలు హీరోకావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా చాలామంది హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేసిన ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్.. ఆయన తనయుడు రాహుల్ విజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ, తన కుమార్తె దివ్యా విజయ్ నిర్మాతగా,రాము కొప్పుల అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం.. ఈ మాయ పేరేమిటో..
కావ్యా థాపర్ హీరోయిన్‌గా పరిచయం కాగా, మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్ర ప్రసాద్,మురళీ శర్మ,ఈశ్వరీ రావ్,ప్రగతి,సత్యం రాజేష్,జోష్ రవి తదితరులు నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.. 
కథ : -
 శ్రీ రామ చంద్ర మూర్తి అలియాస్ చందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఏ పనీ లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు.అనవసరమైన గొడవలకి పోకుండా, పదిమందికి సహాయం చేస్తుంటాడు. తల్లిదండ్రులు కూడా చందుని ఏమీ అనరు. చందు చేసే మంచి పనులు చూసి శీతల్ అతన్ని ఇష్టపడుతుంది. అతని గురించి ఎంక్వైరీ చేస్తుంటుంది. తనగురించి వివరాలు అడుగుతున్న అమ్మాయి ఎవరబ్బా అని చందు కూడా శీతల్ గురించి వెతుకుతుంటాడు.ఒకానొక సందర్భంలో ఇద్దరూ  కలవడం, ఒకరినొకరు ఇష్టపడడం జరిగాక, ఖాళీగా తిరిగేవాడికి నాకూతుర్నిచ్చి పెళ్ళిచెయ్యను అని అమ్మాయి నాన్న చెప్పడంతో, చందు సీరియస్ గా ట్రైచేసి మంచి జాబ్ తెచ్చుకుని శీతల్‌ని కలవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతాడు. ఇద్దరిమధ్య దూరం పెరగడంతో శీతల్ అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. అలాంటప్పుడు చందు తనప్రేమని తిరిగి పొందడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసాడు, చివరికి చందు,శీతల్ కలిసారా, లేదా? అనేది ఓవరాల్‌గా ఈ సినిమా స్టోరీ.

రాహుల్ విజయ్ హీరోగా పరిచయం కాకముందు, లారెన్స్ దగ్గర డ్యాన్స్, దేవదాస్ కనకాల, సత్యానంద్‌‌ల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. అందుకే అతని పెర్ఫార్మెన్స్ చూస్తే మూడు,నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉన్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ కావ్యా థాపర్ నటనా,గ్లామర్ పరంగా పాస్ మార్క్స్ వేయించుకుంది. ఆమె తల్లిదండ్రులుగా మురళీ శర్మ,ప్రగతి, హీరో తల్లిదండ్రులుగా రాజేంద్ర ప్రసాద్,ఈశ్వరీ రావ్, హీరో ఫ్రెండ్స్ గా  సత్యం రాజేష్,జోష్ రవి,భద్రం తమతమ క్యారెక్టర్స్ పరిధిలో చక్కగా నటించారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, ఒకప్పుడు తన పాటలతో ప్రేక్షకులని మైమరపించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్టుగాలేదు. ఎడిటింగ్ కూడా తేడా కొట్టింది. దర్శకుడు ప్రథమార్ధం పై పెట్టిన శ్రద్ధ ద్వితీయార్ధం పై పెట్టలేదు. నువ్వే నువ్వే టైపులో ఎదో చేద్దాం అనుకుని తడబడ్డాడు. శ్యామ్ కె.నాయుడు ఫోటోగ్రఫీ, రాహుల్ నటన,నిర్మాణ విలువలు తప్ప, ఈ మాయ పేరేమిటో గురించి పెద్దగా చెప్పడానికి ఏమీలేదు.  

రేటింగ్ : 2/5

Don't Miss