అమ్మకానికి ఫేస్‌బుక్ మెసేజ్‌లు..!

15:43 - November 3, 2018

లండన్: ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రత మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. కేంబ్రిడ్జి అనలిటికా వివాదంతో చిక్కుల్లో ఉన్న ఫేస్‌బుక్ లో గత నెలలో దాదాపు 3కోట్ల మంది వ్యక్తిగత డేటా లీకైనట్లు ఒప్పుకుంది. 2017 జులై నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఉన్న ఫేస్‌బుక్ కోడ్‌లో లోపం వల్ల హ్యాకింగ్ జరిగినట్లు, దాన్ని అప్పట్లో సరి చేసినట్లు ఫేస్‌బుక్‌ యాజమాన్యం తెలిపింది. తాజాగా ఫేస్‌బుక్‌లోని 12కోట్ల యూజర్ల డేటాను హ్యాక్ చేసి వారి ప్రైవేట్ మెసేజ్‌లు దొంగిలించి అందులోని 81వేల మంది వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్ధ ఈ విషయాన్ని బయటపెట్టింది. 

తమ వద్ద ఉన్న 12కోట్ల ఎఫ్‌బీ అకౌంట్ మెసేజ్‌లు అమ్ముతామని ఓ ఇంటర్‌నెట్ ఫోరమ్‌లో పోస్ట్ చేయడంతో కలలకం చెలరేగింది. వారి వద్ద ఎఫ్‌బీ యూజర్ల మెసేజ్‌లు ఉన్నాయని తెలిపేందుకు శాంపిల్‌గా 81వేల ఖాతాల వివరాలను అప్‌లోడ్ చేశారు. ఒక ఖాతాను 10 సెంట్స్ చొప్పున హ్యాకర్లు అమ్ముతున్నారు. వెబ్‌సైట్ భద్రతా వ్యవస్ధలోని ఓ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు  ఫేస్‌బుక్‌లోని 5కోట్ల ఖాతాదారుల సమాచారం ఉన్న యాక్సెస్ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేశారు. ఖాతాదారుల వివరాలు ఫోన్ నెంబర్లు చిరునామా వంటి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తెలుసుకున్నారు. వారి పర్సనల్ మెసేజ్‌లు కూడా చోరీ చేసినట్లు చెప్పటానికి తమ వద్ద ఉన్న వాటిలోంచి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన శృంగార సంభాషణను హ్యాకర్లు పోస్టు చేశారు. ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన యూజర్లతో పాటు యూకే, అమెరికా, బ్రెజిల్‌ దేశాల ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత సందేశాలను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ యూజర్ల సమాచార భద్రతకు ఎటువంటి ఢోకా లేదని ఫేస్‌బుక్ చెపుతోంది. హ్యాకర్లు ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మెసేజ్‌లు పోస్ట్ చేసిన వెబ్‌సైట్‌ను తొలగించాలని స్ధానిక అధికారులు, న్యాయశాఖ సిబ్బందిని కోరినట్లు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది..

Don't Miss