ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చిన యోగి ఆదిత్యనాధ్

20:02 - November 6, 2018

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తన పదవి కాలంలో రికార్డులు సృష్టించేటట్టు ఉన్నారు. నిన్నటికి నిన్న లక్నోలోని ఏకన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరును భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఏకన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చిన యోగి, మంగళవారం ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో  దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఈప్రకటన చేశారు. అయోధ్య మనకు గర్వకారణమని, అయోధ్య అంటేనే రాముడని యోగి అన్నారు. ఈరోజు నుంచి ఫైజాబాద్‌ జిల్లా అయోధ్యగా పేరు మారుస్తున్నట్లు ఆయన సభాముఖంగా ప్రకటించారు. ఫైజాబాద్ జిల్లా పేరు మార్పుతో పాటు అయోధ్యలో నిర్మించే విమానాశ్రయానికి రాముడి పేరు, వైద్య కళాశాలకు రాముడి తండ్రి దశరధుని పేరు పెడతామని యోగి ఆదిత్యనాథ్  తెలిపారు. గతంలో యూపీ ప్రభుత్వం మొఘల్‌సరై రైల్వే జంక్షన్‌ పేరును దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గాను, అలహాబాద్ ను ప్రయాగరాజ్ గాను మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు బరేలి, ఆగ్రా విమనాశ్రాయాల పేర్లను కూడా మార్చే యోచనలో యోగి  సర్కార్‌  ఉన్నట్లు తెలుస్తోంది.

Don't Miss