నమ్మాల్సిన నిజం : కిలో వంకాయలు 20 పైసలు

11:26 - December 4, 2018

వంకాయలు, వంకాయలు అని ఇంటి ముందుకు బండి వచ్చినా.. కూరగాయలు అమ్మే మనిషి వచ్చినా మనం ఠక్కున ఏమంటాం.. ఎంతమ్మా వంకాయలు కిలో అని.. ఆమె 20 పైసలు అని చెబితే ఎలా ఉంటుంది.. మరీ వెటకారాలు వద్దు.. నిజం చెప్పు అంటాం. ఇది పచ్చినిజం. కిలో వంకాయలు 20పైసలు మాత్రమే. మీరు నమ్మినా, నమ్మకపోయినా పచ్చినిజం. కాకపోతే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. మహారాష్ట్రలో. కిలో వంకాయలు 20పైసలకు అమ్మిన రైతుకి లాభం వస్తుందా.. కచ్చితంగా రాదు. 20పైసలకు వంకాయలు అమ్మేకంటే.. ఊరికే ఇవ్వటం మేలు అనుకున్నాడు. పంటను అంతా పంచిపెట్టేశాడు ఈ రైతు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా రాహతా తెహ్సిల్లోని సకురి విలేజ్. ఆ రైతు పేరు రాజేంద్ర బవేకే..
కిలో 20పైసలే ఎందుకు?
రాజేంద్ర బవేకే.. వంకాయ పంట సాగు చేశారు. రూ.2 లక్షలు ఖర్చు అయ్యింది. పంట చేతికొచ్చింది. కోత మొదలుపెట్టాడు. వ్యాపారితో బేరం పెట్టాడు. మొత్తంగా 65వేలు ఇస్తాను అని చెప్పాడు. 2 లక్షలు ఖర్చు అయ్యింది.. 65వేలు ఏంటీ అని ప్రశ్నించాడు రాజేంద్ర. మార్కెట్ రేటు అంతే అని స్పష్టం చేశాడు. ఈ 65వేలలో రవాణా ఛార్జీలు కూడా నువ్వే భరించాలని చెప్పాడు వ్యాపారి. ఇవన్నీ పోతే మిగిలేది 50వేల రూపాయలు. చేతికొచ్చిన వంకాయలను కిలోల లెక్కన చూస్తే.. 20పైసలు మాత్రమే పడింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు రైతు రాజేంద్ర. 20పైసలకు అమ్ముకునే కంటే.. ఊరికే ఇస్తేపోలా అని నిర్ణయం తీసుకున్నాడు. పంట మొత్తాన్ని నాశనం చేశాడు. కోత ఖర్చు ఇక దండగే అనుకున్న రాజేంద్ర.. మొక్కలను పీకిపారేశాడు.
పురుగు మందుల బాకీ కూడా తీరలేదు :
పంటలోని చీడపురుగుల నిర్మూలన కోసం పురుగు మందులు వాడారు రైతు రాజేంద్ర. దాని కోసం 35వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఆ బాకీ తీర్చటానికి కూడా డబ్బులు లేవు. 2 లక్షల పెట్టుబడికి.. 65వేల వస్తే ఏం చేస్తాం.. ఎలా అప్పుడు తీర్చాలి.. ఇంట్లో తిండి ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు రాజేంద్ర. ప్రభుత్వం ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించాలని.. వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే అన్నారు అంటారు కానీ.. కిలో వంకాయలు 20పైసలు ఏంటండీ.. మరీ దారుణం కాకపోతే. రూపాయికే విలువ లేకుండా పోయిన ఈ రోజుల్లో.. 20పైసలకు కిలో వంకాయలు వస్తున్నాయి అంటే విచిత్రమే కదా.. 

 

Don't Miss