అర్ధరాత్రి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన విరమణ

10:38 - October 3, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆందోళన కొనసాగించిన రైతులు  అర్థరాత్రి ఆందోళన విరమించారు. ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన అన్నదాతలు తమ ఆందోళనలు విరమించుకున్నారు. అంతకు ముందు రైతులు ఆందోళన విరమణకు రైతులు ససేమిరా అన్నారు. తమను ఆపిన చోటే ఆందోళనను కొనసాగిస్తామంటూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక దిల్లీ సరిహద్దులోనే పడకలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. దీంతో అక్కడ వేలమంది పోలీసుల్ని మోహరించారు. కనీస మద్దతు ధరపై స్వామినాథన్‌ కమిటీ నివేదిక పూర్తిస్థాయి అమలు, సంపూర్ణ రుణమాఫీల కోసం రైతులు పట్టుపట్టారు. 11 అంశాలకు గానూ ఏడింటిపై ప్రభుత్వం అంగీకరించినా మిగిలినవి ఆర్థికాంశాలు కావడంతో చర్చించాక చెబుతామన్నారని బీకేయూ ప్రతినిధి యుధ్‌వీర్‌సింగ్‌ తెలిపారు. ఆతర్వాత అర్థరాత్రి ఆందోళన విరమించుకోవడంతో  అధికారులు, అటు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
 
మంగళవారం వేల మంది  అన్నదాతలు దేశ రాజధానిపైకి దండెత్తారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు  చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. పంట రుణాల మాఫీ, ఇంధన ధరల తగ్గింపు, స్వామినాథన్‌ కమిటీ నివేదిక అమలు, పదేళ్లు పైబడిన ట్రాక్టర్ల వినియోగంపై నిషేధం తొలగింపు వంటి వివిధ డిమాండ్ల సాధనకు వీరంతా 'కిసాన్‌ క్రాంతి పాదయాత్ర' పేరుతో భారీ ప్రదర్శన చేపట్టారు. వారిపైకి పోలీసులు జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణలో కొందరు రైతులు, పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించేవరకూ ఆందోళనను విరమించేది లేదని రైతునేతలు స్పష్టం చేశారు. 

రైతులపట్ల కేంద్రం తీరును విపక్షాలు ఆక్షేపించాయి. రైతులపై హింసాత్మక చర్యలకు పాల్పడడమేమిటని కాంగ్రెస్‌, ఆప్‌ ప్రశ్నించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. మరోవైపు పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ సహా కొంతమందితో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చించారు. ఆ తర్వాత ఆందోళనకారుల వద్దకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాజేంద్రసింగ్‌ షెకావత్‌ వచ్చారు. డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తరఫున హామీ ఇచ్చారు. నిరసనకారులు ఆ హామీతో సంతృప్తి చెందలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రాత్రి బైఠాయించారు. 

Don't Miss