టీడీపీ జనసేన మధ్య ఫ్లెక్సీలతో మాటల యుధ్దం

16:37 - November 8, 2018

విజయవాడ: విజయవాడలో టీడీపీ,జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. గతంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుడు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి  కౌంటర్ గా  జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుతో తెలుగుదేశం పార్టీని ఘాటుగా విమర్శిస్తూ  నగరంలో  బుధవారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఇన్నాళ్లు  సైలెంట్ గా ఉన్న  పోలీసులు  ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. 
పవన్ కళ్యాణ్ మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు 2014 లోనే రిటైరయ్యేవారని ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా  కాట్రగడ్డ బాబు..." పవన్ కళ్యాణ్ గారు మీరు మద్దతివ్వకపోతే చంద్రబాబు 2014 లోనే రిటైరయ్యేవారా? ఎందుకు అహంకారపు ప్రగల్భాలు, మీ అన్నదమ్ములంతా కలిసినా 2009లో మీకు వచ్చింది 18 సీట్లే,  ఇప్పుడు తల్లకిందులుగా తప్పస్సు చేసినా మీరు ఒకటో,రెండో సీట్లు గెలిస్తే గొప్ప, అంతకు మించి మీకు సీను లేదు, సినిమా లేదని" గతంలో బ్యానర్లు కట్టారు .
కాట్రగడ్డ బాబు వేసిన  పోస్టర్సకు కౌంటర్ గా విజయవాడలోని బెంజిసర్కిల్ తో సహా ప్రధాన కూడళ్లలో జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుమీద తెలుగుదేశం పార్టీని  ఘూటుగా విమర్శిస్తూ బుధవారం వెలిసిన పోస్టర్లతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. "పచ్చతమ్ముళ్ల పిచ్చిపురాణం, వెంటాడుతున్న ఓటమి భయం, టీడీపీని ఓడించే జనసైనికులం" అంటూ వెలసిన ఫ్లెక్సీలలో తెలుగు దేశం పార్టీపై ఘాటుగా విమర్శించారు. "2019లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీతో అక్రమసంబంధం పెట్టుకున్నారని, దమ్ముంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగా పోటీ చేయాలని" సవాల్ విసిరారు. "2019లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయకపోతే మేము జనసైనికులం కాదని " జనసేన పోస్టర్లలో పేర్కోన్నారు. దీంతో పరిస్ధితి తీవ్ర రూపం దాల్చకుండా  పోలీసులు  రెండు పార్టీల నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిధ్దమయ్యారు.

Don't Miss