ఇండోనేషియాలో విమాన ప్రమాదం

12:17 - October 30, 2018

జకార్తా : ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో 189 మంది జలసమాధి అయ్యారు. వీరిలో శిశువు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. 'లయన్‌ ఎయిర్‌' విమానం జావా సముద్రంలో కూలిపోయింది. 

జకార్తా విమానాశ్రయం నుంచి పంగ్‌కల్‌ పినాంగ్‌ నగరానికి బయలుదేరిన 'లయన్‌ ఎయిర్‌' విమానం గల్లంతైంది. ఉదయం 7.20కి పంగ్‌కల్ చేరుకోవాల్సిన విమానం బయలుదేరిన రెండు నిమిషాలకే గల్లంతైంది. ఇండోనేసియాకు చెందిన 'లయన్‌ ఎయిర్‌' విమానం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లో జావా సముద్రంలో కూలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయ బృందాలను రంగంలోకి దించారు. ప్రయాణికుల్లో ఎవరైనా సజీవంగా బయటపడ్డారేమోనని గాలింపులు చేశారు. ఎక్కడా వారి జాడ కనపడలేదు. సమయం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లాయి. ఈలోగా కొన్ని మృతదేహాలు, అవయవాలను సహాయ బృందాలు గుర్తించాయి. విమానానికి సంబంధించిన ప్రధాన శకలాన్ని ఇంకా కనుగొనాల్సి ఉందని సహాయ చర్యల విభాగం ఉన్నతాధికారి తెలిపారు.

విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం సాధారణంగానే ఉంది. విమానంలోని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ 'బ్లాక్‌ బాక్స్‌' దొరికితేనే ప్రమాదానికి కారణం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ''ఈ విమానం చాలా ఆధునికమైంది.. అది ఎప్పటికప్పుడు డేటాను బట్వాడా చేస్తుంది. దాన్ని కూడా సమీక్షిస్తాం'' అని అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో శకలాలను గుర్తించి, బ్లాక్‌ బాక్స్‌ను వెలికి తీయడం సవాల్‌తో కూడుకున్నదంటున్నారు. 

Don't Miss