రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి మృతి

10:20 - October 3, 2018

అమెరికా : గీతం యూనివర్సిటీ అధినేత, తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమెరికాలో అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తితో పాటు మరో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు మరో నలుగురు కారులో ఉన్నారు. కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

గీతం యూనివర్శిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి....గతంలో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న తానా సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6న కాలిఫోర్నియాలో జరగనున్న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించించేందుకు ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికా వెళ్లారు.

తూర్పు గోదావరి జిల్లా మూలపాలెంకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి...ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్ డీ చేశారు. లా కోర్సు చేసి హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. ఆయన పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. 

గీతం యూనివర్శిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి...1991, 1999లో రెండు సార్లు టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ నేతల్లో విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలకు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలో టీడీపీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ భాషా, నందమూరి హరికృష్ణ, ప్రస్తుతం ఎంవీవీఎస్ మూర్తి...వీరంతా రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందారు. ఎర్రన్నాయుడు, లాల్ జాన్ భాషా, నందమూరి హరికృష్ణతో పాటు ఎంవీవీఎస్ మూర్తిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా పని చేశారు.

Don't Miss