సెట్టింగ్‌‌లో మార్పులు నిజమేనన్న గూగుల్

07:55 - September 18, 2018

అమెరికా : మొబైల్‌ ఫోన్ లో సెట్టింగ్‌లను మన అనుమతి లేకుండానే గూగుల్‌ మార్చేస్తుందా ? అంటే అవునని పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు అంటున్నారు. గత శుక్రవారం పలు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘బ్యాటరీ సేవర్’‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అయింది. తమ ప్రమేయం లేకుండానే ఇలా జరగడంతో పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల‌ వినియోగదారులు చాలా మంది తమ ఫోన్లలో తగినంత ఛార్జింగ్‌ ఉన్నప్పటికీ.. ఆటోమెటిక్‌గా బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆన్‌ అయిందని ఫిర్యాదు చేసినట్లు ‘ఆండ్రాయిడ్‌ పోలిస్‌’ వెబ్‌సైట్‌ తెలిపింది. ‘పై’ లాంటి లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్లు వినియోగిస్తున్నవినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారని పేర్కొంది.
 

ఆ తర్వాత ఈ సమస్యపై గూగుల్‌ సంస్థ స్పందించింది. తాము చేసిన కొన్ని మార్పుల కారణంగానే అలా జరిగిందని తప్పుని ఒప్పుకుంది. ‘కొన్ని ఫోన్లలో బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అవడం జరిగింది. అంతర్గతంగా మేం చేపట్టిన ఓ ప్రయోగం పొరపాటున బయటి ఫోన్లపై ప్రభావం చూపించింది. బ్యాటరీ సేవర్‌ మోడ్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్న సమయంలో ఇలా జరిగింది. మేం వెంటనే సెట్టింగ్స్‌ను తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చాం. ఇందుకు క్షమించగలరు’ అని గూగుల్‌ రెడిట్‌ పోస్ట్‌లో పేర్కొంది.

 

Don't Miss