అమిత్ షా రాకతో కమలంలో జోష్..

15:25 - October 10, 2018

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ.. పార్టీలు ప్రచారపర్వాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో టీఆర్ఎస్ బాగా ముందుంది. ఇప్పుడిప్పుడే విపక్షాలు కూడా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. తాజాగా బీజేపీ స్పీడప్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కరీంనగర్‌లో సమరభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న షా కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  లక్ష్మణ్‌, ఎంపీ దత్తాత్రేయ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. 

విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ అగ్రసేన్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. నేడు మహరాజ్ అగ్రసేన్ జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి బయలుదేరారు. పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, హైదరాబాద్‌లోని శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిలు, ఐదు రూరల్ పార్లమెంట్లకు చెందిన నాయకులతో అమిత్‌ షా సమావేశమవుతున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు. 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించే ‘సమరభేరి’ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షకు పైగా జనం ఈ సభకు హాజరవుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Don't Miss