ప్రొ-కబడ్డీ సీజన్‌6: గుజరాత్‌కు 5వ విజయం, ఢిల్లీకి హ్యాట్రిక్ పరాజయం

11:16 - November 5, 2018

ప్రొ- కబడ్డీ సీజన్‌ సిక్స్‌లో గుజరాత్‌ టీమ్‌ అదరగొడుతోంది. ఆ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. రాత్రి ఢిల్లీతో తలపడిన ఆ టీమ్‌... 45-38 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఢిల్లీకి హ్యాట్రిక్‌ ఓటమి తప్పలేదు. ఇక యూపీ యోధ - బెంగాళ్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది.

ప్రొ- కబడ్డీ 6వ సీజన్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ విజయపరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాత్రి ఆ జట్టు దబాంగ్‌ ఢిల్లీతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టీమ్‌... దబాంగ్‌ ఢిల్లీని 45-38 పాయింట్ల తేడాతో ఓడించింది.

రైడర్‌ రోహిత్‌ గులియా వరుస పాయింట్లు తేవడంతో గుజరాత్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం కొనసాగించింది. తొలి నాలుగు నిమిషాల్లోనే 11-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ ఢిల్లీని ఆలౌట్‌ చేసి ఫస్టాఫ్‌ ముగిసే సరికి 27-18తో నిలిచింది. సెకండాఫ్‌లో డాంగ్‌లీ చెలరేగడంతో గుజరాత్‌ జట్టు పాయింట్లు పెంచుకుంటూ పోయింది. మరోవైపు ఢిల్లీ ట్యాకింగ్‌లో పూర్తిగా విఫలమైంది. మరో రెండు నిమిషాల్లో గేమ్‌ ముగుస్తుందనగా 45-38తో ఆధిక్యాన్ని సాధించిన గుజరాత్‌.. అదే జోరులో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

గుజరాత్‌ ఆటగాడు దక్షిణ కొరియాకు చెందిన డాంగ్‌ జియాన్‌ లీ 10 రైడింగ్‌ పాయింట్లతో రాణించాడు. ట్యాకింగ్‌లో పర్వేశ్‌ 6 పాయింట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ జట్టులో చంద్రన్‌ రంజిత్‌ 11 రైడింగ్‌ పాయింట్లు సాధించినా నిరాశే తప్పలేదు. 

మరో మ్యాచ్‌లో యూపీ యోధ - బెంగాల్ వారియర్స్‌ తలపడ్డాయి. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆఖరి రైడ్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ 30-30 స్కోరుతో టైగా ముగిసింది.  ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ కూడా టైగానే ముగిసింది.

Don't Miss