తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన కుమారుడికి జైలు

14:15 - October 9, 2018

అహ్మదాబాద్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ఓ కుమారుడికి కోర్టు బుద్ధి చెప్పింది. ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏకంగా అతడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. గతిలేని పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. పాపం ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. 

రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. తమకు డబ్బు సరిగా చెల్లించడం లేదని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్‌లో జైలు శిక్ష విధించి నోటీసులు పంపింది.  అయినా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. తండ్రికి డబ్బు ఇవ్వనందుకు 735రోజులు.. తల్లికి పంపనందుకు 810 రోజులు.. మొత్తం కలిపి 1545 రోజులు జైలు శిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కోర్టు తీర్పుపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు కోర్టు హెచ్చరికలు పంపినట్టైంది. 

Don't Miss