హెచ్‌-1బి వీసా నిబంధనలు మరింత కఠినతరం

10:23 - November 3, 2018

అమెరికా : హెచ్‌-1బి వీసా ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది. ఈ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌-1బి కిందవచ్చే కొత్త విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టతరమయ్యేలా వీటిని సిద్ధం చేశారు. భారత ఐటీ నిపుణులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. వీటి ప్రకారం ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల లెక్కలు తప్పనిసరిగా ఉద్యోగ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కోరుతున్న తాజా సమాచారం అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే కొత్తగా హెచ్‌-1బి వీసాదారులను తీసుకొనేందుకు ఉద్యోగ సంస్థలకు అనుమతి ఇస్తారు. దేశీయంగా ఆ ఉద్యోగానికి ఎవరూ అందుబాటులో లేరని శాఖ ధ్రువీకరించిన తర్వాతే విదేశీ నిపుణుల నియామకాలకు సంస్థలకు అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగా కార్మిక నిబంధనల దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి నిపుణుల ఉద్యోగ స్థితిగతులు, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు? ఒక్కో కార్యాలయంలో ఎంత మంది ఉన్నారు? లాంటి వివరాలన్నీ సమగ్రంగా సేకరించేలా దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి లపై ఆధారపడుతున్న సంస్థలు, అవి అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్న ద్వితీయ పక్ష సంస్థలను స్పష్టంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 

 

Don't Miss