బాబుగారూ.. తెలంగాణ ప‌క్షాన నిల‌బ‌డ‌తారా? ఏపీ ప‌క్షాన నిల‌బ‌డ‌తారా?

16:16 - October 7, 2018

సిద్ధిపేట: ఎన్నిక‌లకు తేదీలు ఖ‌రారు కావ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిని, మ‌హాకూట‌మిని టీఆర్ఎస్ నేత‌, ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీష్ రావు టార్గెట్ చేశారు. మహాకూటమి ఓ అతుకుల బొంత అని హ‌రీష్ రావు మండిపడ్డారు. తెలంగాణను దోచుకోవడానికే మహాకూటమి పుట్టిందని ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బు కోసమే మహా కూటమి ఏర్పడిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ నిరోధకులుగానే మహాకూటమి పని చేస్తోందన్నారు. 

నదీ జలాలు, ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పాలని హ‌రీష్ రావు సవాల్ విసిరారు. ఏపీ పక్షాన నిలబడతారా? తెలంగాణ పక్షాన నిలబడతారా? అని అడిగారు. 

రాదనుకున్న తెలంగాణను తెచ్చింది టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పిన హ‌రీష్ రావు.. తెచ్చిన తెలంగాణను నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా టీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ జతకడుతోందని, ఇక ఏమనాలని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కుతంత్రాలకు పాల్పడుతున్నారని.. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కలవడం విడ్డూరంగా ఉందని హ‌రీష్ రావు వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ పైన ఒంట‌రిగా పోటీ చేసే ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని హరీష్ రావు విమ‌ర్శించారు.  ప్రజలు మహా కూటమికి ఓట్లతో బుద్ధి చెప్పాలని హ‌రీష్ రావు పిలుపునిచ్చారు. 

మందపల్లిలో నిర్వహించిన ఏకగ్రీవ తీర్మాన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను అన్ని కుల సంఘాలు ఆయనకు అందించాయి.

వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని.. ఇక బోర్లు, బావులు ఎండిపోవడం వంటివి ఉండవని.. చెరువులు నిరంతరం జలసిరితో క‌ళ‌క‌ళ‌లాడుతాయని హ‌రీష్ రావు అన్నారు. వలసలు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావడమే టీఆర్‌ఎస్ అజెండా అని హరీష్ రావు స్ప‌ష్టం చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఈ 60 రోజులు అందరూ పట్టుదలతో పని చేయాలని, రాబోయే ఐదేళ్లు మీకోసం పని చేస్తానని పేర్కొన్నారు.

Don't Miss