ఉత్తమ్‌కు 12ప్రశ్నలతో హరీష్ రావు బహిరంగ లేఖ

16:28 - October 9, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారు కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. టీఆర్ఎస్ అంతే ధాటిగా ఎదురుదాడికి దిగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహాకూటమిలో భాగంగా టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకునే పొత్తు షరుతులతో కూడినదా? లేక శరం లేని పొత్తా? అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. ఈ మేరకు 12ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్‌, టీడీపీలతో పొత్తుపెట్టుకుందని, కానీ అవి షరతులతో కూడిన పొత్తులు అని హరీష్ రావు స్పష్టం చేశారు. 2009లో తెలంగాణకు మద్దతు ప్రకటించడంతోనే టీఆర్‌ఎస్‌ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందని ఆయన గుర్తు చేశారు. ఇక 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని ఏఐసీసీతో ప్రకటన చేయించామని హరీష్ గుర్తు చేశారు.

ఆ షరతులు ఉల్లంఘించినప్పుడు ఆయా పార్టీలతో తెగదెంపులు చేసుకున్నామని హరీష్ రావు వెల్లడించారు. అదే స్పష్టతను మహాకూటమితో సాధించగలరా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. మహాకూటమి పొత్తు స్వప్రయోజనమో.. రాష్ట్ర ప్రయోజనమో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు మహాకూటమి లక్ష్యం ఎంటో చెప్పాలన్నారు. అడుగడుగున తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్యాయంగా తీసుకున్న ఏడు మండలాలను తిరిగి తెలంగాణను కలుపతామనే ప్రకటన చేయించగలరా? అని హరీష్ రావు ప్రశ్నించారు. లేకపోతే పోలవరం డిజైన్‌ మార్పు చేయించేలా ఏమైనా కండీషన్‌ పెట్టారా? అని అడిగారు

మహాకూటమిలో భాగంగా జరుగుతున్న పొత్తుల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని హరీష్ రావు వాపోయారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా పని చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకి చెందిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో, ఆస్తుల పంపకంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైకోర్టు విభజనలో ఇలా అనేక అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతింటాయనే ఆందోళన తెలంగాణవాదులు, ప్రజల్లో నెలకొని ఉన్నాయని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు మీద ఆధారపడే ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రయోజనాలకు కచ్చితంగా గండిపడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబే అవుతారు, ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగానే ఉంటారు తప్ప ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉండరని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో చంద్రబాబు ఏపీ పక్షాన నిలబడతారా? తెలంగాణ పక్షాన నిలబడతారా? అని హరీష్ రావు నిలదీశారు. అధికారం కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టైనా సరే మేము శరం లేకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పదలుచుకున్నారా? మీది బేషరతు పొత్తా? శరం లేని పొత్తా? ఏ విషయం అనేది ప్రజలకు స్పష్టం చేయాలని హరీష్ రావు కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు.

Don't Miss